ఇండియన్స్ కు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది 10 లక్షల వలసేతర వీసాల జారీ లక్ష్యాన్ని భారత్ లోని అమెరికా మిషన్ అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా పొందిన ప్రతి పదిమందిలో ఒకరు భారతీయులని ఈ సందర్భంగా అమెరికా ఎంబసీ తెలిపింది. అమెరికా వీసాలు పొందిన వారిలో 10 శాతం మంది భారతీయులేనని పేర్కొంది.
వీటిలో విద్యార్థి వీసాలు 20 శాతం, హెచ్ ఎల్ కేటగిరి వీసాలు 65% ఉన్నాయని వివరించింది. భారతదేశంలో ఇప్పుడు జారీ చేసిన వీసాల సంఖ్య 2019, 2022లో జారీ చేసిన వీసాల కంటే 20% అధికమని తెలిపింది. మన్సచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ పట్టా కార్యక్రమానికి వెళుతున్న దంపతులకు 10,00,000వ వీసాను భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అందజేశారు. ‘ఈ ఏడాది 10 లక్షల వీసా మీదే’ అంటూ అమెరికా ఎంబసీ పంపిన ఈమెయిల్ లేడీ హార్డింగే కాలేజీలో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ రంజు సింగ్ కు చేరింది. ఆమె భర్త పునీత్ దర్గాన్ కు 10,00,001వ వీసా మంజూరు అయింది.