కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగిపోవడంతో ఆయన లోక్‌సభలో తిరిగి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి నేతలు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో గతంలో ఆయన ఖాళీ చేసిన ఇంటిని తిరిగి ఆయనకు అప్పగిస్తారా? లేదా? అనే దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.
దిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గతంలో ఆయన నివాసం ఉన్న ఇంటిని తిరిగి కేటాయించాల్సిందిగా రాహుల్ తరఫున పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి పార్లమెంట్ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. కానీ నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీయే స్వయంగా లేఖ రాస్తేనే ఇంటిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీ తన ట్విటర్ బయోలో మార్పు చేశారు. ఇంతకాలం ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’గా ఉన్న స్థానంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా మార్చుకున్నారు.