భర్త చనిపోయిన మహిళ మరో వ్యక్తిని పెళ్లాడాలని భావించింది. అందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి వారిని అడ్డుతొలగించుకోవాలనుకుంది. కుమార్తెను (మైనర్) విక్రయించి.. కుమారుడిని హాస్టల్లో వదిలిపెట్టింది. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో చోటుచేసుకుంది.
ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దంపతులు పనుల కోసం కొన్నేళ్ల క్రితం ముజఫర్‌పుర్ వచ్చారు. రెండేళ్ల కిందట భర్త మరణించడంతో.. ఆ మహిళ స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ప్రేమలో పడి, అతణ్ని పెళ్లాడాలనుకుంది. పిల్లలతో వస్తే పెళ్లి చేసుకోనని ఆ వ్యక్తి తెగేసి చెప్పడంతో నిందితురాలు తన కుమార్తెను (మైనర్) ఓ వ్యాపారవేత్త(35)కు విక్రయించింది. కుమారుడిని ఓ ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహంలో దించి దిల్లీ వెళ్లిపోయింది.
హాస్టల్ ఫీ చెల్లించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తాత, మామయ్య వచ్చి నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి.. వ్యాపారవేత్తను, బాలిక విక్రయంలో సహకరించిన దంపతులను అరెస్టు చేశారు. నిందితురాలు, ఆమె ప్రియుడిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.