ప్రతీ ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు… ఎంత చేసినా ఏదో ఒకరకంగా ఇబ్బంది పడి ఉంటారు. కర్మ సిద్ధాంతం నమ్మిన వారు తప్పక గ్రహప్రభావమని భావిస్తారు. దీనికోసం భక్తులలో దాదాపు అందరూ ఏదో ఒక సందర్భంలో నవగ్రహారాధన చేస్తారు. నవగ్రహాల అనుగ్రహం ఉంటే బాధలు పోతాయి అనేది కర్మ సిద్ధాంతం పేర్కొంటుంది. కాబట్టి వ్యతిరేకంగా ఉన్న గ్రహాలకు ఆయా మార్గాలలో శాంతి చేసుకుంటారు. అయితే ప్రధానంగా ఇంట్లో ఈ నవగ్రహాల ఫొటోలను పెట్టుకుని ఆరాధన చేస్తే మంచిదా? నవగ్రహాల ఫోటోలను పెట్టుకుని నిత్యారాధన చేస్తే మంచిదని భావిస్తుంటారు. అయితే అలా చేయవచ్చా అనేది పండితులు పేర్కొన్న విషయాలు తెలుసుకుందాం…
శనీశ్వరుణ్ణి, నవగ్రహాలను ఇంటిలో పూజగదిలో పెట్టి అసలు పూజ చేయకూడదని పండితులు చెప్పుతున్నారు.అసలు శనితో పాటుగా ఏ నవగ్రహాలను ఇంటిలో పూజించే సంప్రదాయం పూర్వ కాలం నుండి కూడా లేదు. కొన్ని పురాతన దేవాలయాలలో నవగ్రహాలు ఉండవు.దాదాపుగా 200 సంవత్సరాల నాటి గుడిలో నుంచి మాత్రమే నవగ్రహాలు ఉంటున్నాయి.నవగ్రహాలు ఆ దేవదేవుడు ఆదేశించే పనులను మాత్రమే చేయటానికి ఆదేశం ఉంది.కాబట్టి నవగ్రహాల కారణంగా వచ్చే ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆ దేవదేవుని పూజించాలి. అంతేకాని నవగ్రహాలను పూజించకూడదు. అయినా సరే మన పండితులు ఆయా గ్రహాల దోష నివారణకు పరిహారాలు,పూజలు,ప్రదక్షిణాలు చేయిస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రత్యేకంగా ఇంటిలో నవగ్రహాలకు పూజ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేయాలని అనుకుంటే మాత్రం ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు చేశాకే. దీపారాధన చేసి దీపజ్యోతిలో నవగ్రహాలను ఆవాహన చేసుకుని ఆ తరవాత మాత్రమే పూజించాలి. పండితులతో వేదమార్గంలో చెప్పిన పూజలు, జపాలు చేసుకుంటే చాలు. వీలైనంత వరకు దేవాలయాలలో నవగ్రహాలకు పూజలు, పరిహరాలు చేసుకుంటే మంచిది. అంతేకాని నవగ్రహాల ఫోటోలు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు.
– శ్రీ