నయనార్లు అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది పరమ శివ భక్తులని. వారి భక్తి అనన్యం. అత్యంత పేరుగాంచి శివభక్తులు వారు. వారి జీవితాలు గురించి ఒక్కసారి చదువుకున్నా, మననం చేసుకున్నా చాలు మనకు ముక్తి, చిత్తశుద్ధి కలుగుతాయని పండితుల వచనం. నయనార్లలో ఒక్కరైన ఇయ్యల్పహ గురించి తెలుసుకుందాం…
ఒక గొప్ప తమిళభక్తుడు ఇయ్యల్పహ (మానవనైజమునకు విరుద్ధముగా ప్రవర్తించిన వాడు) అను, నామాంతరముతో శాశ్వత కీర్తి నొందెను. ఏదైనను లేదనడు (ఇల్లయై – ఎన్నద) అను విశేషణముతో సుందరుడు అతనిని వర్ణించెను. మహోన్నత ప్రవర్తనము గల ఈ భక్తుని జీవితమును, సరళముగ, ఆకర్షణీయముగా అర్థవంతమైన పద్యములలో శేక్కిళారు చిత్రీకరించెను.
ఇయ్యల్పకు శివుడు పెట్టిన పరీక్ష
ఒక దినము పరమశివుడు, బ్రాహ్మణ వేషమున ఇయల్పహ నాయనారు ముందు ప్రత్యక్షమయ్యెను. నాయనారు అతనికి పూజ్య భావముతో ఘనస్వాగత మొసంగెను. ఆ విప్రుడు, శివభక్తులేది కోరినను ప్రీతితో నొసంగుదువని నాచెవిన బడినది. నేను కోరుదానిని నీవు తప్పక యిత్తువనిన, నేను దానిని నీకు చెప్పెదననెను. వెంటనే నాయనారు, స్వామి! నా కడ నున్నదేదైనను, అది శివభక్తులదే. దీనిలో సంశయము లేదు అని బదులు పలుకగనే ఆ బ్రాహ్మణుడు, నేను నీ ప్రియపత్నిని కోరి వచ్చితి నని చాలా మృదువుగా చెప్పెను.
నాయనారు దిగ్భ్రాంతి జెందలేదు. తనకున్న దానినే అడిగినందులకు అదృష్టముగా భావించెను. తక్షణమే గుణవంతురాలు, ప్రియమైనది తగు తన భార్యతో, గుమ్మమున నున్న అతిథికి ఆమె నిత్తునన్న వాగ్దానమును చెప్పెను. ఒక క్షణం ఆమె నిశ్చేష్టయై వెంటనే అది దైవ పరీక్షయే అని గ్రహించెను. కావున ఆమె, ప్రాణనాథా! మీ ఆజ్ఞను శిరసావహించుట కంటె నాకు వేరొక ధర్మం గలదా అనెను. (దేహములతో సంబంధం లేకుండ, జీవులందరికి పరమేశ్వరుడే యజమాని యని యిందు ధ్వనించుచున్నది) అట్లనుచు మొదట తన భర్తకు, తరువాత బ్రాహ్మణునికి నమస్కరించెను. భక్తుడు,ఓ మహాత్మా, మీ ఆదేశము లింకేవియో తెలుపు డనెను.
అప్పుడు ప్రతిగ్రహీత ఇంతమాత్రమే! ఈ బహుమతిని నీ దగ్గిర నుండి పొందినందులకు సహజముగ (నే ననుకొనుచుంటిని) మీ బంధువులు కోపోద్రేకంతో నన్నడ్డగింపకుండునటుల, మమ్ము కాపాడ, నీవు మావెంట ఈ పురం దాటి సురక్షిత స్థలం చేరువరకు తోడుగ రావలయును అని కోరెను. దానికి భక్తుడు, స్వామి! ఇది మీరు కోరక ముందే నేనే చేయవలసినది అనెను. అప్పుడు నాయనారు, కత్తి మొదలగు సామాగ్రిని ఒక గుడ్డలో కట్టుకుని రక్షణార్థము వారి వెంట బోవ సిద్ధపడెను. అనుకొనినట్లే బంధువులందరు ఈ సంఘటన తమ వంశానికే అప్రతిష్టగా నెంచి సంఘర్షణకు దిగిరి. బ్రాహ్మణస్వామి భయపడినట్లు కనబడెను. ఇయల్పహ నాయనారు బంధువులను నిరోధించును గావున స్వామి శాంతంగా నుండవలెనని కీర్తనీయమైన ఆ యువతియు అనెను. అప్పుడు నాయనారు కూడ స్వామీ! నన్ననుగ్రహింపుడు. వారిని నాశన మొనర్చెద ననెను. వారికొక హెచ్చరిక నిచ్చి మొండిగా నిలిచియున్న బంధువులందరిని సంహరించెను. బ్రాహ్మణుని ఒక సురక్షిత స్థలమునకు చేర్చెను.
భక్తుని నిశ్చల మనస్సు ఎటువంటిదో చూడుడు! తన పూర్వపు సహధర్మచారిణి, జీవిత భాగస్వామి, తన్ను శాశ్వతముగా వదిలి వెళ్ళిపోవుచున్నదని, ఒక్కసారి కూడా వెనుకకు చూడక అతడు వేగముగా ఇంటి దారి పట్టెను.
అతని అసాధారణ సాహసమునకు మెచ్చి బ్రాహ్మణుడు, నాయనారును తిరిగి రమ్మని పిలిచెను. ఇంకేదైన కీడు రానున్నదేమో అని ఆశ్చర్యముతో నాయనారు తిరిగి వెళ్ళగా, బ్రాహ్మణుడు కానరాలేదు. తన భార్య యెక్కతియే నిలిచి యుండెను. అంత పరమశివుడు, ఉమాసహితముగా, నందివాహనుడై కైలాసము నుండి నాయనారు దంపతులకు దర్శనమిచ్చి, వారిని మృతులైన వారి బంధువులతో కూడి కైలాసమునకు వచ్చి యుండుటకు అనుగ్రహించిరి అలా పరమ శివుడు పరీక్షలో విజయం సాధించి తనతోపాటు భార్యకు, బంధువులకు సైతం ముక్తికి కారణమయిన పరమ భక్తులు ఇయ్యల్పహ.
– కేశవ