అసని కారణంగా ఉద్యాన వన పంటలకూ, ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. 51 వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా పలు చోట్ల వరి పంట నాశనం అయి, రైతుకు పుట్టెడు దుఃఖాన్నే మిగిల్చింది. ఏటా తుఫానుల కారణంగా నష్టపోతున్న రైతాంగంకు అందుతున్న సాయం మాత్రం అంతంత మాత్రమే అవుతోంది. పంటల బీమా ఉన్నా కూడా పెద్దగా సాయం దక్కడం లేదు. దాంతో వ్యవసాయ రంగం నుంచి ఆశించిన ఫలితాలు తాము అందుకుంటున్నది ఏమీ లేదని సంబంధిత వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. పంట ఎప్పుడూ తమకు నష్టాన్నే ఇస్తుంది అని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు ఉన్నా కూడా సంబంధిత డబ్బులు ఏవీ సకాలంలో తమకు రావడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అదేవిధంగా పంట నష్టం అంచనాల్లో అధికారులు మరీ ఏక పక్షంగా వ్యవహరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుఫానుకు సంబంధించి నష్టాలు కొన్ని ప్రాథమికంగా తెలిశాయి. ఆ విధంగా చూసుకున్నా చాలా ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు గాలులకు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వడ్ల నుంచి మొలకలు వచ్చాయి. పంట చేలల్లోకి నీరు చేరిన కారణంగా అవి ఎందుకు ఇక పనికి రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. దిగుబడి శాతం పూర్తిగా పడిపోవడం ఖాయమని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
అసని కారణంగా రైతాంగం కు ఈ రబీ సీజన్ అస్సలు కలిసి రాని విధంగానే ఉంది. కేంద్రం తక్షణమే స్పందించి తక్షణ సాయంగా ఓ వెయ్యి కోట్లు రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది అన్న వాదన ఒకటి వినిపిస్తుంది సంబంధిత వర్గాల నుంచి ! ఏటా తుఫానుల కారణంగా పంటలు పోయి రుణ భారం పెరిగిపోతోంది అని, బ్యాంకులలో ఇక రుణాలు పొందే అవకాశాల్లేక ప్రయివేటు రుణాలపై ఆధారపడి సాగు చేసినా ఫలితం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో సీఎం జగన్ బాధిత ప్రాంతాలకు అధికారులను., ప్రజా ప్రతినిధులను పంపి నష్ట నివారణకు పూనిక వహించాలి.