టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మహబూబ్ నగర్ లో భూ సేకరణ పేరిట వందల ఎకరాలు లాక్కుంటున్నారు అని అన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా భూములు తీసుకోవడం లేదని చెప్పి.. ఇప్పుడు మహబూబ్ నగర్ లో రాత్రికి రాత్రి జేసిబీలు పంపి కంచెలు వేస్తున్నారన్నారు. బడా బాబుల కోసం పేదల భూములు లాక్కుంటున్నారు అని ఆరోపించారు శ్రవణ్. మహబూబ్ నగర్ లో మంత్రి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలు బతుకొద్దా?.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కోవడానికి మీకు అధికారం ఎవరిచ్చారని అన్నారు. అధికారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బానిసలుగా మారారని ఫైర్ అయ్యారు. అసలు సీఎస్ సోమేశ్ కుమార్ కు మెదడు ఉందా..? అంటూ ప్రశ్నించారు శ్రవణ్. భూములు తప్పనిసరి అయితే.. 2013 చట్టం ప్రకారం భూ పరిహారం చెల్లించాలని అన్నారు. పేదలకు న్యాయం చేసే వరకూ కాంగ్రెస్ పేదలకు అండగా ఉంటుంది అన్నారు.