ఒడిశాలో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రమాదమేనా.. లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా.. లేదా ఇందులో ఏదైనా కుట్ర దాగుందా అనే అంశంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా దాదాపు 70 మంది మృతదేహాలు ఒడిశాలోని మార్చురీలోనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ ప్రమాదానికి గల కారణాన్ని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ తన నివేదికలో వెల్లడించింది. సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ బాధ్యతల్లో ఉన్న ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహానగాలో ఘోర రైలుప్రమాదం జరిగినట్లు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే విషయమై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున సేఫ్టీ కమిషన్ నివేదికను బహిర్గతం చేయడం లేదు. మరోవైపు ఆగ్నేయ రైల్వేలో జనరల్ మేనేజర్ అర్చన జోషిని బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అనిల్‌కుమార్ మిశ్రను నియమిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.