బీఆర్ఎస్ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్లతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి బిగ్ ఓ షో మ్యూజికల్ ఫౌంటెన్‌ను శనివారం రోజున మంత్రులు సందర్శించారు. ఫౌంటెన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సియోల్ నగరంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా, విదేశీ పర్యటన చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
ఆధునిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి, సరికొత్త హంగులతో కూడిన మ్యూజికల్ ఫౌంటెన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ తెలిపారు. ఇది సియోల్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను మించి ఉంటుందని వెల్లడించారు. ‘అదే విధంగా రాష్ట్రంలో మహబూబ్‌నగర్, ఇతర పట్టణాలలో మ్యూజికల్ ఫౌంటెన్ల ఏర్పాటుకు పరిశీలిస్తున్నాం. మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్‌బండ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.