కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో భారత్‌లో ఉద్భవించిన కరోనా బి.1.617.2 వేరియెంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మరో వేరియెంట్‌కు కప్పా అని నామకరణం చేసింది. అయితే ప్రస్తుతం డెల్టా వేరియెంట్ మళ్లీ ఉత్పరివర్తనం (మ్యుటేషన్) చెంది డెల్టా ప్లస్ వేరియెంట్‌గా మారిందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
డెల్టా ప్లస్ వేరియెంట్‌ను ఏవై.1 వేరియెంట్ అని పిలుస్తున్నారు. దేశంలో పలు చోట్ల డెల్టా వేరియెంట్ మ్యుటేషన్‌కు గురై డెల్టా ప్లస్ వేరియెంట్‌గా మారిందని చెబుతున్నారు. దీన్నే బి.1.617.2.1 గా పిలుస్తున్నారు. అయితే ఈ కొత్త వేరియెంట్ గురించి మరిన్ని పరిశోధనలు చేయాలని వారు చెబుతున్నారు.
కాగా దేశంలో కోవిడ్ చికిత్సకు గాను మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్‌ను అనుమతిస్తున్న విషయం విదితమే. ఇందులో కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీ బాడీలను రోగి శరరీంలోకి ప్రవేశపెడతారు. దీనికి ఒక్క డోసుకు రూ.59,750 వరకు ఖర్చవుతుంది. దీంతో రోగి త్వరగా కోవిడ్ నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా ఉద్భవించిన డెల్టా ప్లస్ వేరియెంట్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్‌ను కూడా తట్టుకుందని సైంటిస్టులు నిర్దారించారు. కానీ ఈ వేరియెంట్ ఎంత వరకు ప్రమాదకరం అనే విషయాలు ఇప్పుడే తెలియవని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని అంటున్నారు.