తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయానికి వచ్చింది అనేది స్పష్టంగా తేలకపోవడంతో ఆశావాహులు అధిష్టానం దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ, తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పిసిసి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నా, 2014 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోనూ చేదు ఫలితాలే దక్కించుకుంటూ వస్తుండడం వంటి వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్నా, నాయకులు మాత్రం పిసిసి అధ్యక్ష పదవిని తామే దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ,ప్రధానంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి – రేవంత్ రెడ్డి మధ్య పిసిసి అధ్యక్ష పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది.
పిసిసి పీఠం పై క్లారిటీ వచ్చిన తర్వాత రేవంత్ కు పదవి దక్కకపోతే, కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే రేవంత్ కు కనుక పదవి ఇస్తే , సీనియర్ నాయకు లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి , శ్రీధర్ బాబు ఇలా చాలా మంది కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో, కాంగ్రెస్ అధిష్టానం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.