వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

-

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల పై లెక్కలేస్తున్నారట. కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేపట్టి.. పల్లాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని గులాబీ బాస్‌ నిర్ణయిస్తే.. అది ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చర్చ మొదలైంది.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రెండోసారి గెలిపించేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు గులాబీ బాస్‌ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. నిర్లక్ష్యంగా ఉన్నవారికి వార్నింగ్‌లు వెళ్లడంతో అలాంటి వారు కూడా ఎన్నికల్లో ఒళ్లు వంచి పనిచేయక తప్పలేదు. చివరకు పల్లా గెలుపు పార్టీ నేతలకు సంతోషం తీసుకొచ్చినా.. ఇప్పుడు జిల్లాలోని ప్రజాప్రతినిధులు వేసుకుంటున్న లెక్కలే అధికారపార్టీ శిబిరంలో ఆసక్తిగా మారింది. ఇప్పుడిప్పుడే జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నాయకుల అసలు రంగు బయటపడుతోందట.

పల్లా గెలుపు తమకు చేటు అని కొందరు ఎమ్మెల్యేలు సన్నిహితుల దగ్గర మొరపెట్టుకున్నారట. ఎమ్మెల్యేలుగా తొలిసారి గెలిచి మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రస్తుతం భయం పట్టుకుందట. త్వరలో తమకు కేబినెట్‌ బెర్త్‌ కన్ఫామ్‌ అని ఇన్నాళ్లు ఆశించిన వారు.. ఇప్పుడు మంత్రివర్గంలోకి పల్లాను తీసుకుంటే ఎలా అని మథన పడుతున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రమాదం పసిగట్టి పల్లా కోసం వారు గట్టిగా పనిచేయలేదని టాక్‌. ఇప్పుడు పల్లా గెలిచిన తర్వాత వారి హావభావాలు మారిపోయాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అని భావించిన మరో ఎమ్మెల్యే పల్లా గెలుపుతో తెగ సంతోషిస్తున్నారట. నాకు మంత్రి పదవి రాకున్నా పర్వేలేదు.. నా పోటీదారుడికి మాత్రం కేబినెట్‌లో చోటు దక్కదని సంబరపడుతున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. త్వరలో ఎమ్మెల్సీ గడువు తీరిపోతున్న మరో నాయకుడైతే ఇక రెన్యువల్‌ కష్టమేనని ఆయన, ఆయన అనుచరులు, ఆ ఎమ్మెల్సీ ప్రత్యర్థి వర్గానికి చెందినవారు భావిస్తున్నారట. ఈ విషయంలో ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఒకవేళ పల్లాను కేబినెట్‌లోకి తీసుకుంటే.. జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఉన్నవారిలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయట. ఒక మంత్రి అంటే పడని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ మినిస్టర్‌కు పదవీగండం పొంచి ఉందని అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారట. పల్లా ఎమ్మెల్సీగా గెలుపొందడం వల్ల వచ్చే ఎన్నికల్లో తమ సీటుకు పోటీ తప్పిందనే భావనలో మరి కొందరు నేతలు ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version