ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా! మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

-

ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లో చిక్కింది. మహమ్మారి మరోసారి పంజా విసురుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూడటం ఇందుకు ప్రధాన కారణం. కొత్త వేరియంట్ బయట పడటంతో ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా ఏకంగా నాలుగు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. నిజానికి ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైందా? అంత భయంకరమైందా? మరోసారి లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితులు తలెత్తుతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ బి.1.1.529‌కు డబ్ల్యూహెచ్ఓ ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 77 కేసులు, బోట్సావానాలో 4, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా హాంగ్‌కాంగ్‌లో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రాథమిక దశలోనే ఉన్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే చాప కింద నిరులా వ్యాపించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఇప్పటివరకు బయటపడ్డ వేరియంట్ల కంటే ఒమిక్రాన్ భిన్నమైందని శాస్త్రవేత్తలు తెలుపతున్నారు. ఇదే అత్యంత ప్రమాదకరమైంది అని, భయంకరమైంది అని చెబుతున్నారు. ఈ అంచనాలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ అసాధారణ స్థాయిలో ఉత్పరివర్తనాలు జరగడమే. ఒమిక్రాన్ మొత్తం 50 ఉత్పరివర్తనాలు చెందింది. స్పైక్ ప్రొటీన్లలో 30కిపైగా మ్యూటేషన్లు జరిగాయి. మానవ కణజాలంలోకి కరోనా వైరస్ చొచ్చకు పోవడానికి స్పైక్ ప్రొటీన్ సహకరిస్తుంది. రిసెప్టార్ బైండింగ్ డోమైన్‌లో సైతం 10 ఉత్పరివర్తనాలు ఉన్నాయనే, అందుకే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని శాస్తవేత్తలు అంచనా వేస్తున్నారు.

గతంలోనూ కొత్త వేరియంట్లు ప్రమాదకరమని ప్రచారం జరిగినా ప్రభావం చూపలేదు. దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూసిన బీటా వేరియంట్‌పై ఇలాగే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ, అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత బయటపడ్డ
డేల్టా వేరియంట్‌లో రెండు ఉత్పరివర్తనాలు జరిగాయి. ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఒమిక్రాన్‌లో
ఇప్పటివరకు ఉన్న ఉత్పరివర్తనాలతోపాటు కొత్త మ్యూటేషన్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ వ్యాప్తి, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే గుణం ఒమిక్రాన్ వేరియంట్‌లో అధికంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రాథమిక దశలోనే ఉన్నది. వ్యాప్తి, రోగ నిరోధక శక్తి ప్రభావంపై అంచనాల కానీ ఇంకా ఎక్కడా నిర్ధారణ కాలేదు. వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతుందో కూడా ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఒకవేళ డెల్టా వేరియంట్ మాదిరిగానే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటే మాత్రం మరోసారి లాక్‌డౌన్ తప్పకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version