టీడీపీలో మ‌ళ్లీ క‌ల‌క‌లం… ఈ సారి నెల్లూరు వంతు..

-

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎంఎల్ఏ, పారిశ్రామికవేత్త అయిన బీద మస్తాన్ రావు టీడీపీని వీడుతున్న‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా..ఆయ‌న న‌మ్మిన నేత‌గా.. మ‌న‌సు తెలుసుకుని మెదులుతూ జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌స్తాన్‌రావుపై అభిప్రాయం ఉంది. అలాంటి నేత చంద్ర‌బాబును కాద‌ని వైసీపీ కండువాక‌ప్పుకోబోతార‌న్న ప్ర‌చారం కొద్దిరోజులుగా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న‌ట్లు గ‌మ‌నార్హం.

అదే జ‌రిగితే జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌చారానికి కార‌ణం ఇటీవ‌ల నెల్లూరు జిల్లా ముమ్మిడూరులో మ‌త్స్య‌కారుల కోసం ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన ప‌థ‌కం ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో క‌ల‌సి మ‌స్తాన్‌రావు వేదిక పంచుకోవ‌డమే.
టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్న క్ర‌మంలో బీద మ‌స్తాన్‌రావు ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం స‌హ‌జంగానే అన్ని పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించింది. వేదిక‌పై బీద‌తో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా రాజ‌కీయ నేత‌ల‌ను ఒంకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌.

కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి మాట్లాడిన అనంత‌రం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా బీద మ‌స్తాన్‌రావుతో వ‌చ్చి మాట్లాడార‌ని స‌మాచారం. ఆక్వా రంగంలో బీద కుటుంబం సేవ‌ల‌ను గుర్తించి ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌స్తాన్‌రావుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌డంపై వైసీపీ నేత‌లు కూడా ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని చెవులు కొరుక్కోవ‌డం జ‌రిగింద‌ని స‌మాచారం. పార్టీ మారుతార‌ని వ‌స్తున్న ప్ర‌చారంపై బీద స్పందించారు. సంబంధిత మంత్రి పిలుపు మేర‌కే ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి వ‌చ్చింద‌ని, మొద‌టి నుంచి త‌మ‌కు ఆక్వా రంగంలో ఉన్న అనుభ‌వం ఉన్న నేప‌థ్యంలోనే ఆ కార్య‌క్ర‌మం నుంచి త‌న‌కు పిలుపు వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చార‌ట‌.

అయితే తానో వ్యాపారవేత్త‌గానే ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ట‌. ప్ర‌భుత్వ ఆక్వా క‌మిటీలో స‌భ్యుడిగా ఉండాల‌ని జ‌గ‌న్ కోరిన విష‌యం కూడా బ‌హిర్గ‌తం చేయ‌డం విశేషం. త‌న‌ను రాజ‌కీయ నాయ‌కుడి నుంచి వేరు చేసి ఈ కార్య‌క్ర‌మం వ‌ర‌కు వ్యాపార‌వేత్త అనే కోణంలో చూసే వారికి ఎలాంటి అనుమానాలు రావ‌ని చెప్పుకొచ్చారు. అయితే బీద టీడీపీలోనే ఉంటారా..? మ‌రి ప్ర‌చారం జ‌రుగుతున్నట్లు పార్టీ మారుతారా అనే విష‌యం మ‌రికొద్ది రోజులు ఆగితే గాని తెలియ‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version