కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టి) బ్రేక్ వేసింది. బహుళార్థసార్దక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పై దాఖలైన పిటిషన్ల పై నేడు ఎన్ జి టి ప్రధాన బెంచ్ తీర్పు వెల్లడించింది. జస్టిస్ ఆదర్శ గోయల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు ఈ నెల 12 న తుది వాదనలు పూర్తి కాగా, ఈరోజు ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్నది సరైంది కాదని, ప్రాజెక్టు విస్తరణపై నిపుణుల కమిటీతో మదింపు చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రాజెక్టు విస్తరణ వల్ల పర్యావరణం పై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనలు కూడా అందజేయాలని సిడబ్ల్యూసి సైతం వెల్లడించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టవద్దని ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఎన్జీటీ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లోపభూయిష్టంగా ఉన్నాయని హయతుద్దీన్ అనే ఆయన 2017లో పిటిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, మోటర్ల ద్వారా రోజుకు 2 టిఎంసి ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని, 3 టిఎంసి ల మేరకు పెంచుతూ ప్రభుత్వం చేపట్టిన విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్లు దాఖలు అయ్యాయి.