‘నిర్భయ’కు అభయం ఎన్నడో..?

-

2012, డిసెంబర్‌ 16! యావత్‌ భారత ప్రజలకు పీడకల లాంటి ఒక భయంకరమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన రోజు! దేశ ప్రజల గుండెలను రగిలించిన రోజు! సమాజంలోని ప్రతి ఒక్కరిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసిన రోజు! ఆరు మానవమృగాలు ఒక అమాయక యువతిపై పశువుల్లాపడి అఘాయిత్యం చేసిన రోజు! అంతటితో ఆగక ఆమె కడుపులో పేగులను ఛిద్రం చేసి పైశాచికానందం పొందిన రోజు!

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఏడున్నరేండ్లు గడిచిపోయాయి. అయినా దోషులకు శిక్ష పడలేదు.. బాధితులకు న్యాయం దక్కలేదు. న్యాయవ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఒకవైపు దోషులు దోబూచులాడుతుంటే.. మరోవైపు తమ కూతురుకు న్యాయం దక్కితీరాలన్న పట్టుదలతో ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు ఊపిరి కూడగట్టుకుని పోరాడుతున్నారు.

ఈ నేపథ్యంలో నిర్భయపై అఘాయిత్యం జరిగిన తీరు, తదనంతర పరిణామాలు, దోషులు అత్యంత తెలివిగా న్యాయవ్యవస్థతో చెలగాటమాడుతున్న వైనం, ఈ కేసు ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలను ఒకసారి అవలోకన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దోషుల తరఫు న్యాయవాది న్యాయవ్యవస్థలోని లొసుగులను వినియోగించుకుంటున్న తీరును గమనించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

వివరాల్లోకి వెళ్తే.. 2016, డిసెంబర్‌ 16న నిర్భయ తన స్నేహితుడితో కలిసి ఫస్ట్‌ షో సినిమాకు వెళ్లింది. రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఇద్దరూ కలిసి ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అయితే అప్పటికే ఆ బస్సులో మానవరూపంగల ఆరు క్రూరమృగాలు ఉన్నాయనే సంగతిని వారు గుర్తించలేకపోయారు. ఇదే వారిపాలిట శాపంగా మారింది. నిర్భయపై అత్యాచారం, హత్యకు దారితీసింది.

నిర్భయ, ఆమె స్నేహితుడు బస్సు ఎక్కిన కాసేపటి తర్వాత గానీ.. వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో గుర్తించలేకపోయారు. బస్సు డ్రైవరు, అతని ఐదుగరు స్నేహితులు పూటుగా మద్యం సేవించి ఉన్నారనే విషయం గమనించి కీడును శంకించారు. వెంటనే బస్సు ఆపమని కోరినా.. అప్పటికే నిర్భయపై కన్నేసిన రాక్షసులు బస్సును ఆపలేదు సరికదా.. బస్సు దిగిపోయేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరినీ బలవంతంగా లోపలికి నెట్టేశారు.

దీంతో వాగ్వాదానికి దిగిన నిర్భయ స్నేహితుడిని స్పృహతప్పి పడిపోయే వరకు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నిస్సహాయురాలిగా మిగిలిపోయిన నిర్భయపై తోడేళ్లలా ఎగబడ్డారు. కాళ్లు మొక్కుతానన్నా కనికరించలేదు. రెండు చేతులు జోడించి దండం పెట్టినా విడిచి పెట్టలేదు. కదులుతున్న బస్సులోనే ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ నరరూప రాక్షసులు అంతటితో ఆగారా.. అంటే అదీలేదు. నిర్భయ జననావయవాల్లో ఇనుపరాడ్డుపెట్టి, పేగులు ఛిద్రమయ్యేలా కుళ్లబొడుస్తూ పైశాచికానందం పొందారు. ఒళ్లంతా వాతలు పడేలా కొట్టారు. ఎక్కడపడితే అక్కడ గోళ్లతో రక్కి, పళ్లతో కొరికి వీధి కుక్కల్లా ప్రవర్తించారు. ఆ తర్వాత అపస్మార స్థితిలో ఉన్న ఇద్దరిని మహిపాల్‌పూర్‌ ఫ్లైఓవర్‌ దగ్గర బస్సులోంచి కిందపడేసి పారిపోయారు.

ఈ దారుణ ఘటన గురించి తెలియగానే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. నిర్భయ రేపిస్టులను ఉరితీసి చంపాలంటూ.. దేశంలోని అన్ని నగరాలేగాక పట్టణాలు, పల్లెల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. జనం ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు.

మరోవైపు అప్పటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడం కోసం బాధితురాలి పేరుతో కఠినమైన ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకొచ్చింది. నిర్భయ కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును సైతం ఏర్పాటు చేసింది. దీంతో విచారణ వేగంగానే జరిగింది. ఏడాదిలోపే దోషులకు ఉరిశిక్ష పడింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉరిశిక్షల అమలు మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది. ట్రయల్‌ కోర్టు 2013, సెప్టెంబర్‌ 13న దోషులకు ఉరిశిక్షలు విధిస్తే.. ఆ తర్వాత దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. అయితే కోర్టులు శిక్షలు విధించి ఆరున్నరేండ్లయినా అవి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ చట్టపరమైన అవకాశాల పేరుతో వారిని ఎప్పటికప్పుడు ఉరిశిక్షల నుంచి తప్పిస్తూ వస్తున్నారు.

చివరాఖరికి డెత్‌ వారెంట్లు జారీ అయినా.. దోషులు తమ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలను ప్రదర్శిస్తూ దేశ న్యాయవ్యవస్థనే పరిహసిస్తున్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్‌ పిటిషన్లు, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ల పేరుతో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులువేస్తూ కోర్టులతో దోబూచులాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు డెత్‌ వారెంట్లు జారీ అయినా.. దోషులు మాత్రం ఉరికంబం ఎక్కలేదు.

డెత్‌ వారెంట్లు జారీ అయినప్పుడల్లా దోషులు తమ చట్టపరమైన అవకాశాలను పొదుపుగా వినియోగించకుంటూ.. ఉరిశిక్షలు అమలు కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. వరుసగా మూడు డెత్‌ వారెంట్లను విఫలం చేయడంలో సఫలీకృతులయ్యారు. దేశ ప్రజల సహనానికి కఠిన పరీక్ష పెట్టారు. సమాజానికి కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు.

మరోవైపు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌.. చట్టపరమైన అవకాశాల వినియోగం విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహం కట్టలుతెంచుకునేలా చేస్తున్నది. పవన్‌గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి సైతం ‘నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్‌’ అంటూ ఏపీ సింగ్‌ను హెచ్చరించాడంటే.. అతను కోర్టులను ఎంతగా అసహనానికి గురిచేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రవిచిత్ర పరిణామాలతో దేశ ప్రజలందరిలోనూ ఒక సందేహం బలంగా పాతుకుపోయింది. అదేంటంటే.. ‘ఇంతకూ నిర్భయ దోషులను ఉరితీస్తారా.. లేదా?’ అని. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులు మాత్రం ఇకపై దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోలేరని కచ్చితంగా చెబుతున్నారు. ఇన్నాళ్లూ దోషులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగినప్పటికీ.. ఇకపై వారి ఆటలు సాగవంటున్నారు.

దోషులు ఇప్పటివరకు తమకుగల చట్టపరమైన అవకాశాలను ఒక్కొక్కటిగా ఉపయోగించుకుంటూ ఉరిశిక్షల అమలును వాయిదా వేసుకోగలిగారని, ఇప్పుడు వారికి ఎలాంటి అవకాశాలు లేవని, అన్ని దారులు మూసుకుపోయాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సారి గనుక డెత్‌ వారెంట్‌ జారీ అయితే, ఆ తేదీ ప్రకారం నిందితులను ఉరితీయడం ఖాయమని తెగేసి చెబుతున్నారు.

ఇదిలావుంటే, పవన్‌గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడం, దోషుల ఉరితీతకు మరోసారి డెత్‌ వారెంట్‌ జారీచేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం పటియాలా హౌస్‌ కోర్టును కోరడం బుధవారం (మార్చి 4న) చకచకా జరిగిపోయాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం పటియాలా హౌస్‌ కోర్టు దోషులకు మరోసారి డెత్‌ వారెంట్లు జారీచేయడం, నిర్ణీత తేదీన వారిని ఉరికంబం ఎక్కించడం ఖాయమే అనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version