కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పోంజి స్కీమ్స్‌కు అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ దిశగా పని చేస్తోందని తెలిపారు. అయితే ప్రస్తుతం తమ వద్ద సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆర్థిక పరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లను నియంత్రంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. పలు రకాల పోంజి యాప్స్ ఉన్నాయని, వీటికి అడ్డు కట్ట వేయడానికి ఐటీ శాఖతో, ఆర్‌బీఐతో కలిసి పని చేస్తున్నామని వివరించారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాల్లో అటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించడం వల్ల నష్టం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడే సూచనలు ఇస్తున్నారు. కానీ, అందులో కొందరు మోసపూరితమైన సలహాలు ఇచ్చేవాళ్లు ఉంటారన్నారు. రోజుల వ్యవధిలోనే పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని, అనేక రెట్లు పెరిగిపోతుందనే లెక్కలు చెబుతారు. అలాంటి సలహాలు మోసంతో కూడినవని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి వాటిపై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. పాంజీ మోసం అంటే కొత్తవాళ్ల నుంచి డబ్బు సేకరించి పెట్టుబడిదారులు చేసే మోసం.