నిజామాబాద్ వైద్య కళాశాలలో విద్యార్థి హర్ష ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థి మృతి గురించి ప్రిన్సిపల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ కూడా స్పందించారు. హర్ష మరణంపై ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు.
‘హర్ష చాలా తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. బాగా చదువుకునే వాడు. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా తన ఆత్మహత్యకు అవే కారణమై ఉండొచ్చు’ అని ప్రిన్సిపల్ చెప్పారు.
ఇవాళ ఉదయం జరుగుతున్న ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం పరీక్షకు హాజరు కాకుండా హర్ష తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికే రెండు పరీక్షలు రాశాడు. హర్ష మరణానికి అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని తోటి విద్యార్థులు కూడా భావిస్తున్నారు. హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని జిన్నారం మండలం చింతగూడ అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని హర్ష ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.