ఒక వారం క్రితం గిరిజన సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. అదేంటంటే గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీచర్స్ విద్యార్థుల ఇళ్లకి వెళ్లి పాఠాలు చెప్పాలని ఆదేశించింది. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ప్రతి రోజు స్కూల్ కి హాజరు కావాలని, ప్రతి టీచర్ రోజు కు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బోధించాలని ఆ ఉత్తరువుల్లో పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల లో పని చేసే టీచర్స్ గ్రామాలను దత్తత తీసుకోవాలి.. రోజుకో గ్రామానికి రొటేషన్ పద్దతి లో వెళ్ళాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ఒక్కో విద్యార్థికి రెండు గంటల చొప్పున ప్రతిరోజూ ముగ్గురు విద్యార్థులకు చదువు చెప్పాలని గిరిజన సంక్షేమ కమీషనర్ ఆ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్ళకి వెళ్లి చదువు చెప్పాలనే ఉత్తర్వులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రద్దు చేశారు. ఈ హోం ట్యూషన్స్ రద్దు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ అమలు చేస్తున్న విధంగా 50% ఉపాధ్యాయులు పాఠశాలకు, 50% ఉపాధ్యాయులు ఇంటినుండి పని చేయాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.