తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఉంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఇప్పటికే భూముల మార్కెట్ విలువ, స్టాంపు డ్యూటీ చార్జీలను పెంచడం ద్వారా ఖజానా నింపుకొనే ప్రయత్నం చేసింది. అదీ చాలదన్నట్లు రెండో దశ అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ మరింత రాబడి సమకూర్చుకోవాలని తలచింది. కానీ, కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది.
లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రెండు దశల్లో పూర్తిచేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం ప్రక్రియను వచ్చే 15 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కానీ, అక్రమ లే అవుట్లు, అనుమతిలేని ప్లాట్ల క్రమబద్దీకరణ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో కథ అడ్డం తిరిగింది.
ఎల్‌ఆర్‌ఎస్ అంశం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం ఆదేశాల మేరకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20 వరకు వచ్చే దరఖాస్తులపై కేవలం పరిశీలన మాత్రమే జరుపుతామని తెలిపింది. వచ్చిన దరఖాస్తులను క్లస్టర్లు, లేఅవుట్ల ఆధారంగా విభిజించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమమా? కాదా? అని నిర్ధారణ చేస్తామని పేర్కొంది. కానీ, క్రమబద్ధీకరణ ఉండదని స్పష్టం చేసింది. దీంతో రెండో దశ ఎల్‌ఆర్‌ఎస్ రాబడి పెంచుకుందామనుకున్న సర్కార్ ఆలోచనకు ఆదిలోనే శుభంకార్డు పడింది.