టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. నష్టాలను తగ్గించేందుకు.. కొన్ని బస్సు డిపోలను ఎత్తివేయనున్నట్లు వార్తలు వచ్చాయి.. దీంతో.. తమ ప్రాంతంలో బస్సు డిపోలు ఎత్తి వేస్తే.. తమకు ఇబ్బందులు తలెత్తుతాయని.. అర కోరగా నడిచే బస్సులు కూడా రావేమోనని ప్రజలు ఆందోళన చెందారు.. అయితే.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా.. ఆర్టీసీ డిపోలను ఎత్తివేసే ప్రసక్తే లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శుభవార్త చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోను సందర్శించారు సజ్జనార్. డిపో నిర్వహణపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు సజ్జనార్. ప్రయాణికులు స్వచ్చందంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపుతున్నామని తెలిపారు. దూర ప్రాంతాలకు స్లీపర్, ఏసీ, నాన్ ఏసీ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందరూ ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని ఎండీ సజ్జనార్ కోరారు.