రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలు, సరకు రవాణా, సేవలకు సంబంధించి అన్‌లాక్ -3 మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎం.హెచ్.ఎ) లేఖలు పంపింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల యంత్రాంగాలు స్థానికంగా ఆంక్షలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఆంక్షలు, సరకు రవాణా, సేవలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అందడంలో ఇబ్బందులు కలిగిస్తాయని ఆ లేఖలో పేర్కొంది.
ఆంక్షలు విధించడం వల్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని, ఇది ఉపాధిపైన, సరకులు ,సేవల అందుబాటుపైన ప్రభావం చూపుతుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఆంక్షలు విధించడం విపత్తుల నిర్వహణ చట్టం 2005 నిబంధనల కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని హోంమంత్రిత్వ పేర్కొంది.