కేరళలో ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది.. కొత్త కొత్త వైరస్‌లు కేరళలోనే ఎంట్రీ ఇస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి.. కేరళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మొన్నటివరకూ నైల్ ఫీవర్ అన్నారు. మళ్లీ ఇప్పుడు నోరో వైరస్ అంటున్నారు. నిజానికి నోరో వైరస్ ఇప్పటిది కాదు.. గత ఏడాదే ఇది కేరళలో వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కేసులు పెరుగుతున్నాయట.
కలుషిత ఆహారం, నీరు, ఉపరితలాల ద్వారా వైరస్ సంక్రమించే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కోరారు.
పరిశుభ్రతతోనే మనల్ని మనం కాపాడుకోగలమంటున్నారు మంత్రి వీణా జార్జ్. వడదెబ్బ లక్షణాలతో ఉండే ఈ వైరస్ ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయలేకపోతున్నారట.
లక్షణాలు:
నోరోవైరస్ అనేది డయేరియాను ప్రేరేపించే రోటవైరస్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు అత్యంత సాధారణ కారణమైన వైరల్ అనారోగ్యం. విరేచనాలు, వాంతులు, తలనొప్పులు, ఒంటి నొప్పుల తీవ్రంగా ఉండటం దీనిని లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
కొన్నిసార్లు.. ద్రవాలు పూర్తిగా కోల్పోయి.. నిర్జలీకరణానికి దారితీస్తుంది.
మల విసర్జన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు శుభ్రం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
నోరోవైరస్ ఇన్ఫెక్షన్ పేగు మంట, పోషకాహార లోపంతో సంబంధం కలిగి ఉందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుందని కనిపించిన ఆధారాలు సూచిస్తున్నాయి.
కేరళలో మొట్టమొదటిగా నమోదైన నోరోవైరస్ గతేడాది జూన్‌లో అలప్పుజా జిల్లాలో కనిపించింది. అలప్పుజా మున్సిపాలిటీ సమీప పంచాయతీల నుండి 2021లో నోరోవైరస్‌తో సంబంధం ఉన్న తీవ్రమైన డయేరియా వ్యాధుల్లో 950 కేసులు నమోదయ్యాయి. వ్యాధి వ్యాప్తి నెలన్నర పాటు ఉందని తెలిసింది. తాజాగా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో నోరో వైరస్‌ను నిపుణులు గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారినపడిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని..నివారణ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
నోరోవైరస్ సోకిన వారికి వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతుంటారు. మూడు రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి, అయితే కోలుకున్న తర్వాత కూడా, సోకిన వ్యక్తి రెండు వారాల వరకు వైరస్‌ను వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.