కరోనా వైరస్ టెస్ట్ చేసేందుకు అనేక దేశాల్లో చాలా తక్కువ సమయం పడుతుంటే భారత్‌లో మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు అభివృద్ది చేసిన ఓ కొత్త పరికరంతో ఇకపై కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే కరోనా ఫలితం రానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జాతీయ పశు జీవసాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్ఐఏబీ) నిపుణులు ఓ నూతన పరికరాన్ని తయారు చేశారు.
కరోనా టెస్టు కోసం సదరు నిపుణులు వ్యక్తుల నోట్లో నుంచి లాలాజలం సేకరించి ఆ శాంపిల్‌ను సదరు పరికరం ద్వారా విశ్లేషిస్తారు. దీంతో కేవలం 30 సెకన్లలో ఆ వ్యక్తులకు కరోనా ఉందీ, లేనిదీ తెలుస్తుంది. కాగా ఆ నిపుణుల కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అభినందించారు.
లాలాజలం ఆధారంగా 30 సెకన్లలోనే కరోనాను నిర్ధారించేలా హైదరాబాద్‌లోని జాతీయ పశు జీవసాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్ఐఏబీ) కొత్త ఉపకరణాన్ని రూపొందించడం ముదావహం. శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ ఉపకరణం అందుబాటులోకి వస్తే.. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటానికి కొత్త శక్తి అందినట్లవుతుంది. #COVID19
— Vice President of India (@VPSecretariat) May 3, 2020
ఇక ఎన్ఐఏబీ నిపుణులు ఆ పరికరాన్ని తయారు చేసినందుకు గాను వారిని అందరూ అభినందిస్తున్నారు. కరోనా టెస్టు రిజల్ట్ కేవలం 30 సెకన్లలోనే రావడం శుభ పరిణామమని, దీంతో నిత్యం ఎన్నో లక్షల మందికి టెస్టులు చేయవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ పరికరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఎంతో మేలు కలగనుంది.