ప్రముఖ డిజిటల్ వాలెట్ పేటీఎం దేశంలోని వ్యాపారులకు శుభవార్త చెప్పింది. పేటీఎంను ఉపయోగిస్తున్న వ్యాపారులు తమకు కస్టమర్లు చెల్లించే మొత్తాలకు గాను పేటీఎం ఇప్పటి వరకు ఒక రోజు వచ్చే పేమెంట్లను మరుసటి రోజు సెటిల్‌మెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఇకపై పేమెంట్లు అదే రోజు సెటిల్‌మెంట్ అవుతాయి. వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్లను సెటిల్ చేసుకోవచ్చు. ఈ మేరకు పేటీఎం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పేటీఎంలో కొత్తగా అందిస్తున్న సేమ్ డే సెటిల్‌మెంట్ ఫీచర్ వల్ల వ్యాపారులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని పేటీఎం భావిస్తోంది. చిరు వ్యాపారులకు ఇది కలసి వస్తుందని తెలిపింది. ఏ రోజు కారోజు డబ్బు అవసరం అయ్యే వారికి ఈ ఫీచర్ పనికొస్తుందని పేటీఎం వ్యాఖ్యానించింది.
కాగా వ్యాపారులు తమ పేమెంట్లను కనీసం రూ.50 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒక ట్రాన్స్‌ఫర్‌కు సెటిల్ చేసుకోవచ్చు. ఇక రోజులో ఒకటి, రెండు, మూడు సార్ల వరకు పేమెంట్లను సెటిల్ చేసుకోవచ్చు. దీని వల్ల కస్టమర్లు పేమెంట్లు చేసిన వెంటనే వ్యాపారులు పేటీఎం ద్వారా ఆ పేమెంట్లను సెటిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. త్వరలో రానున్న దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను వ్యాపారులకు అందిస్తున్నట్లు పేటీఎం తెలియజేసింది. దీన్ని పేటీఎం మర్చంట్ డ్యాష్ బోర్డ్ లేదా పేటీఎం ఫర్ బిజినెస్ యాప్‌లలో ఉపయోగించుకోవచ్చు.