ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అమెజాన్‌లో యూజర్లు మెడిసిన్లను కూడా కొనవచ్చు. అందుకు గాను అమెజాన్ ఫార్మసీ పేరిట కొత్త సర్వీస్‌ను అమెజాన్‌లో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం బెంగళూరు పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ సదుపాయాన్ని విస్తరిస్తారు.
అమెజాన్ ఫార్మసీలో డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌తో మందులను కొనవచ్చు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్‌ను కూడా కొనవచ్చు. అలాగే ఆయుర్వేద మందులను కూడా విక్రయిస్తున్నారు. ఇప్పటికే వన్ ఎంజీ, నెట్ మెడ్స్, ఫార్మ్ ఈజీ తదితర సైట్లలో మెడిసిన్లను డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో జనాలు ఆన్‌లైన్‌లో మెడిసిన్లను కొనుగోలు చేయడం కూడా ఎక్కువైంది. అందుకనే అమెజాన్ కూడా తన సైట్‌లో ఫార్మసీ సేవలను ప్రారంభించింది.
కాగా ఇ-ఫార్మసీలను నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ నుంచి డ్రగ్స్ అమ్మేందుకు అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో అమెజాన్ స్థానికంగా ఉండే ఫార్మసీలతో టై అప్ అయ్యి మెడిసిన్లను తన ఫార్మసీ సైట్‌లో విక్రయించనుంది. కాగా అమెజాన్‌లో ఇప్పటికే కిరాణా సరుకులను కొనే సదుపాయం కూడా అందిస్తున్నారు.