గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రచ్చ లోకి ఎన్టీఆర్ వచ్చేశారు. తెలుగు దేశం పార్టీ పోటీ సంగతి ఎలా ఉన్నా….మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మాత్రం మారుమోగుతోంది. సమాధులు కూల్చాలన్న అసద్ వ్యాఖ్యలపై ఇటు బిజెపి ఫైర్ అవుతుండగా…అటు టిఆర్ఎస్ కూడా మండి పడుతుంది. అసలు పార్టీ టీడీపీ మాత్రం ఈ వివాదంలో ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభివృద్ది అంశం పక్కకు పోయి కొత్త ఇష్యూలు తెరపైకి వచ్చాయి. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సర్టికల్ స్ట్రేక్ కాంమంట్లతో మొదలైన రచ్చ…ఇతర అంశాలకు దారి చూపింది. ఎంఐఎం నేత అసద్ వ్యాఖ్యలతో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ పేరు ఎన్నికల్లో ప్రధాన చర్చకు కారణం అయ్యింది. ప్రభుత్వం ముందు మాజీ ప్రధాని పివి, మాజీ సిఎం నందమూరి తారక రామారావు సమాధులు కూల్చాలని పిలుపు ఇచ్చారు.దీంతో అధికార టిఆర్ఎస్ తో పాటు….ప్రతిపక్ష బిజెపి కూడా ఈ కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యాయి.
ఎన్టీఆర్, పివి ఆదర్శ నేతలు అంటూ బండి సంజయ్ ఎంఐఎంపై మండిపడ్డారు. పివి, ఎన్టీఆర్ సమాధుల సందర్శన కూడా పెట్టుకున్నారు. మరోవైపు కెటిఆర్ కూడా ఎంఐఎం వ్యాఖ్యలపై తీవ్ర అంభ్యంతరం తెలిపారు. తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఎన్టిఆర్ సమాధిపై వ్యాఖ్యాల అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా గ్రేటర్ ఎన్నికల్లో మాజీ సిఎం ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఈ వివాదంలో తెలంగాణ టిడిపి పోటీలో ఉన్నా ఆ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. టిడిపి పోటీ నామమాత్రమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పోటీ లో ప్రభావం చూపకపోయినా….ఎన్టీఆర్ పేరు, సమాధి మాత్రం ఓట్ల రాజకీయానికి వేదికగా మారాయి. ఎన్టిఆర్ సమాధిపై ఎంఐఎం నేతల వ్యాఖ్యలపై బిజెపి వేగంగా స్పందించింది. తద్వారా…..తెలుగు దేశం ఓట్లతో పాటు…ఎన్టిఆర్ అభిమానుల ఓట్లకు గాలం వేసే పని మొదలు పెట్టింది. స్వయంగా ఘాట్ సందర్శించిన బండి సంజయ్….ఎన్టీఆర్ ను అంటుంటే తెలుగు దేశం మౌనంగా ఉండడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. ఎంఐఎం వ్యాఖ్యలను ఖండించడంలో, బదులివ్వడంలో తెలంగాణ టిడిపి వెనుక బడిందంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్ లో ఉండే ఎపి ప్రజలు టిఆర్ఎస్ కే మద్దతు పలికారు. దీంతో వారి ప్రభావం అధికంగా ఉండే కూకట్ పల్లి, శేర్ లింగం పల్లి, కుత్భుల్లాపూర్ వంటి చోట్ల కూడా టిఆర్ఎస్ జెండానే ఎగిరింది. అయితే ఈ సారి ఎన్నికల్లో దానికి గంటి కొట్టాలని బిజెపి మొదటి నుంచి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇదే సందర్భంలో ఎంఐఎం నేత అక్బర్ వ్యాఖ్యలతో కమల నాథులు వెంటనే రంగంలోకి దిగారు. ఎన్టిఆర్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఘాట్ ల వద్దకు వెళ్లి మరీ నివాళులు గటించారు. వీరిద్దరు మహా నేతలని…వారికి పార్టీలు, ప్రాంతాలు అంట గట్టవద్దని గళం ఎత్తుతున్నారు. తద్వారా ఇటు టిడిపి సానుభూతి ఓట్లతో పాటు…..అటు ఆయా ప్రాంతాల్లో ఉండే ఏపీ ఓట్లర్ల కు గాలం వేస్తున్నారు.
ఈవిషయంలో అధికార టిఆర్ఎస్ కంటే….ప్రతిపక్షం బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుంది. టిడిపి వ్యవస్థాపక అద్యక్షుడు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం ఎంత వరకు ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందో చూడాలి.