హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపటి నుంచి నుమాయిష్‌.. టికెట్ ధరలు ఇలా

-

హైదరాబాదులో ప్రతి ఏడాది నిర్వహించే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ కు రంగం సిద్ధమైంది. ‘నుమాయిష్’కు ఎప్పట్లాగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది. నుమాయిష్ నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10:30 వరకు కొనసాగనుండగా, ఈ సారి టికెట్ ధరను రూ.30 నుండి రూ.40 కి పెంచారు. మరోవైపు ఎగ్జిబిషన్ చుట్టూర ఫ్రీ వైఫై అందించనున్నారు.

ఈ 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో 2,400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో విదేశీ సంస్థలకు చెందిన స్టాళ్లు కూడా ఉన్నాయి. కాగా, ‘నుమాయిష్’లో ఈసారి టికెట్ ధర పెంచారు. గతంలో రూ.30 ఉన్న టికెట్ ధరను ఇప్పుడు రూ.40కి పెంచారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారి వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.

స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 1938లో ‘నుమాయిష్’ ప్రారంభమైంది. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మొదట్లో 50 స్టాళ్లతో ప్రారంభమైన ‘నుమాయిష్’ ఇప్పుడు 2 వేలకు పైగా స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాదులో నిర్వహించే ‘నుమాయిష్’ ను నిత్యం 45 వేలమంది సందర్శిస్తారని అంచనా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version