కరోనా వస్తే చాలా మంది భయపడుతున్నారు. తమకు ఏదో అవుతుందని, తాము ఇక బతకమని తమలో తాము భయపడుతూ తీవ్ర విచారానికి లోనవుతున్నారు. అది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనస్థైర్యం కోల్పోయేలా చేస్తుంది. దీంతో ఆ భయానికే చనిపోతారు. అలాంటి వారిని చాలా మందిని చూస్తున్నాం. అయితే నిజానికి ధైర్యంగా ఉండడమే సగం బలాన్నిస్తుంది. ధైర్యంగా ఉండి వ్యాధిపై పోరాడితేనే బతుకుతాం. అవును, సరిగ్గా ఇదే విషయాన్ని ఆ నర్సు నిరూపించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
మధ్యప్రదేశ్‌కు చెందిన 39 ఏళ్ల ప్రఫులిట్ పీటర్ అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు చిన్నతనంలో యాక్సిడెంట్ అయి ఒక ఊపిరితిత్తిని కోల్పోయింది. డాక్టర్లు ఆమెకు సర్జరీ చేసి దాన్ని తీసేశారు. అప్పటి నుంచి ఆమె ఒకే ఊపిరితిత్తితో జీవిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని తికాంగడ్ సివిల్ హాస్పిటల్‌లో ఆమె నర్సుగా పనిచేస్తోంది.
అయితే గత 14 రోజుల కిందట ఆమెకు కోవిడ్ సోకింది. రెండూ ఊపిరితిత్తులూ పనిచేస్తేనే చాలా మంది కోవిడ్ నుంచి కోలుకోవడం కష్టం. అలాంటిది ఆమె ఒకే ఒక్క ఊపిరితిత్తితో కరోనాపై పోరాటం చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ ఆమె ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. ధైర్యంగా చికిత్స తీసుకుంది. ఇంట్లోనే ఉండి కోవిడ్ చికిత్స తీసుకుంది. రోజూ యోగా, ప్రాణాయం, ఇతర శ్వాస వ్యాయామాలు చేసింది. ఎట్టకేలకు ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఆమెకు కరోనా తగ్గిందని వైద్యులు తెలిపారు. ఆమెను చూసి కోవిడ్ బాధితులు ధైర్యంగా ఆ వైరస్‌పై పోరాటం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.