రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏ నిముషానికి ఏమి జరుగునో.. అన్న విధంగా రాజకీయాలు మారిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో టీడీపీ రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఒక్కటే ఉద్యమాలు చేస్తే.. సరిపోదు. ఎవరో ఒకరు తోడు కావాలి. పైగా చంద్రబాబు తాను చెప్పేది.. ప్రజలు నమ్ముతున్నారో.. లేదో.. అనే శంకతో ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. ఈయన ఎప్పుడు ఏం చేసినా.. ఏం చెప్పినా.. సమర్ధించే మరోపార్టీని వెతుక్కుంటారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు.. కన్నా లక్ష్మీనారాయణ పైకి టీడీపీతో దూరం అంటూనే .. చంద్రబాబు చేసిన విమర్శలనే ఆయన కూడా చేసేవారు.
చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలనే కన్నా కూడా వినిపించేవారు. దీంతో చంద్రబాబుకు ఒకింత పరోక్ష బలం చేకూరేది. ఇప్పుడు కన్నా పోయి.. సోము వీర్రాజు వచ్చాక.. టీడీపీని ఏకేస్తున్నారు. దీంతో బాబుకు పరోక్ష బలం తగ్గింది. ఈ క్రమంలోనే ఆయనకు అందివచ్చిన వరంగా కమ్యూనిస్టులు దొరికారు. కమ్యూనిస్టులు బాబుకు పాత మిత్రులే. అయితే, 2014లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారు దూరమయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో వారు జనసేనతో చేతులు కలిపారు. అయితే, పవన్ కూడా పోయి పోయి.. బీజేపీకి చేరువయ్యే సరికి కమ్యూనిస్టులు ఒంటరివారయ్యారు.
దీంతో వారికి కూడా బలమైన పార్టీ అండ అవసరమైంది. ఈ నేపథ్యంలో టీడీపీతో అంటకాగుతున్నారు. పైకి ఎలాంటి ఒప్పందాలు లేకపోయినా.. చర్చలు జరగకపోయినా.. లోపాయికారీ.. ఒప్పందాలు జరిగిపోయాయని పెద్ద ఎత్తున కమ్యూనిస్టులే లీకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో టీడీపీ చేస్తున్న ప్రతి నిరసనకూ కమ్యూనిస్టులు జెండాలేసుకుని వచ్చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ కామ్రేడ్లు పాల్గొంటున్నారు.
ఇది టీడీపీకి ఒకవిధంగా మేలు చేస్తుంటే.. కమ్యూనిస్టులకు కూడా మరో రకంగా లాభిస్తోందట. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశానికి కూడా ఇరు పక్షాలు ఒకే అజెండాతో వెళ్లడాన్ని బట్టి.. ఈ పార్టీల మధ్య అవగాహన కుదిరిందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల వరకు ఈ అవగాహన ఉంటుందా? అనేది సందేహం. రాజకీయాల్లో ఈరోజున్నది రేపు ఉండదు కనుక.. ఎప్పటిదప్పుడే! సో. ఏ రోజు ఆనందం.. ఆరోజుదే! అంటున్నాకమ్యూనిస్టులు. ఇదీ సంగతి..!