ప్రముఖ బాలీవుడ్ నటి, కాంగ్రెస్ మాజీ నేత ఊర్మిళ మంతోద్కర్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే యోచనల్లో మహారాష్ట్ర అధికార శివసేన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ లో మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో 12 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం 12 మంది జాబితా పై నిన్న కేబినెట్‌లో చర్చించింది. ఈ జాబితాలో ఊర్మిళ పేరు కూడా ఉన్నట్టు అక్కడి మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి.
ఊర్మిళను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తుందన్న ఊహాగానాలను తాను విన్నానని, దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ జాబితాపై గోప్యత కూడా ఏమీ లేదని రాష్ట్ర మంత్రి అనిల్ కూడా అన్నారు. మూడు పార్టీల నేతలు జాబితాను ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ముంబయి నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఊర్మిళ ఓటమిపాలయ్యారు. అనంతరం ముంబయి కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి నచ్చకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.