ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బలం లేని టీడీపీ వ్యక్తి గెలవడం రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టించింది. అయితే.. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే శ్రీదేవి డబ్బులకు అమ్ముడుపోయి వైసీపీ ఓటమికి కారణమైందని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆమె కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే ఆమె కార్యాలయంలోని పార్టీ ప్రచార రథాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీకి మోసం చేసిన శ్రీదేవిని అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించిందని, అలాంటప్పుడు ఆమె వద్ద పార్టీకి సంబంధించిన ప్రచారం రథం ఎందుకని వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.
కాగా మొత్తం 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 సీట్లు అధికార వైసీపీ గెలుచుకోగా.. ఒక్కసీటును టీడీపీ గెల్చుకుంది. అయితే టీడీపీకి సంఖ్యాబలం లేకున్నా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో టీడీపీ ఒక్కసీటును గెల్చుకోగల్గింది. ఇక ఫలితాల అనంతరం క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించిది. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటిపై వైసీపీ వేటు పడింది. ఈ క్రమంలోనే బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు ఆదివారం దాడికి ప్రయత్నించగా.. సోమవారం మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది.