వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 69 మందికి గాయాలయ్యాయి. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. క్షతగాత్రులను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఇటీవల వచ్చిన భూకంపాల ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలగా తాజాగా మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. సోమవారం సంభవించిన భూకంపంతో ఇప్పటికే దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. సుమారు 25 భవనాలు కూలినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం శిథిలాల కింద తండ్రీకుమార్తెలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
కాగా, ఫిబ్రవరి 6న దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విపత్తు కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 11 రాష్ట్రాలలో మాలత్యా కూడా ఒకటి. ఈ ప్రకృతి విలయ తాండవం కారణంగా తుర్కియే, సిరియా దేశాలలో 48 వేల మందికి పైగా మృతి చెందారు. దీంతోపాటు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 1,73,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు భూకంప ప్రభావిత ప్రాంతాలలో దాదాపు 10,000 ప్రకంపనలు సంభవించాయి. దీంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని అధికారులు కోరుతున్నారు.