ఇప్పుడు జనం బాగా తెలివి మీరిపోయారు. ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఆన్ లైన్ లోనూ ఆఫర్ అన్న పదం లేనిదే కొనేందుకు మొగ్గు చూపడం లేదు. అయితే వ్యాపారులు కూడా ఈ ఆఫర్లవీక్ నెస్ ను సొమ్ము చేసుకుంటున్నారు. తమ వ్యాపార విస్తరణకు ఈ ఆఫర్లనే నమ్ముకుంటున్నారు.
ఈ ఆఫర్ల ప్రభంజనం పీక్స్ కు చేరిందనడానకి ఈ తాజాగా రూపాయి చేపల వ్యవహారమే ఉదాహరణ. శివగంగ జిల్లాలోని కరైకుడిలో ఓ వ్యాపారి కొత్తగా చేపల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభ ఆఫర్ కింద కేవలం ఒక్క రూపాయికే కేజీ చేపలు అంటూ ప్రకటించేశాడు.
అదేంటి మరీ ఒక్క రూపాయికే ఇస్తే ఆయనకు ఏం మిగులుతుంది.. పైగా బోలెడంత నష్టం కదా అనుకుంటున్నారా.. ఇక్కడ కూడా ఆ వ్యాపారి ఓ టెక్నిక్ ఉపయోగించాడు. తన దగ్గర వచ్చిన మొదటి వంద మందికి మాత్రమే కేవలం రూపాయికి కిలో చేపల అమ్ముతానని ప్రచారం చేశారు.
ఫ్రీ అంటే ఎగబడే జనం ఆటోమేటిగ్గా ఈ ఆఫర్ కు కూడా భారీగా స్పందించారు. ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు దుకాణం ముందు బారులు తీరారు. తొలి వంద మందికే కేజీకి రూపాయి వసూలు చేసిన ఆ వ్యాపారి… ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం బాగానే రేటు పెట్టేశాడు. దీంతో ప్రచారానికి ప్రచారమూ వచ్చింది.. వ్యాపారంలో లాభమూ వచ్చింది. ఈ టెక్నిక్నేదో బాగానే ఉంది కదూ.