పిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అందిపుచ్చుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం జగన్‌కు రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన ఉత్తమ సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నట్టు కొన్నాళ్ల కిందట జాతీయస్థాయి సర్వే ఒకటి వెల్లడించింది. ఇక, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలోనూ కేంద్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ దూసుకుపోతోందని, ప్రభుత్వ విధానాలు బాగున్నాయని కితాబు లభించింది. పాలనలో తనదైన శైలిని అవలంభిస్తూ.. అజాత శత్రువుగా జగన్ నిలుస్తున్నారని పక్కరాష్ట్రాల సీఎంలు కూడా అంటున్నారు.
ఇక, రాష్ట్రంలోనూ జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. పేదలకు అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రభుత్వానికి మంచి మార్కులు పడేలా చేస్తున్నాయి. అదే సమయం డ్వాక్రా గ్రూపులకు నిధులు ఇవ్వడం, చేనేత సహా రైతాంగానికి అన్ని విధాలా సాయం చేయడం వంటివి .. జగన్ సర్కారుపై అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి అభిప్రాయం వ్యక్తమవుతున్న మాట వాస్తవమే. అయితే, ఎటొచ్చీ.. ప్రజలకు ఎన్నో చేస్తున్నా.. సొంత పార్టీ నేతల్లో మాత్రం అసంతృప్తి ఉంది. తమను అస్సలు పట్టించుకోవడం లేదని, తమకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదని నాయకులు వాపోతున్నారు.
“ ఇప్పటికి నేను నాలుగు సార్లు సీఎం అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాను. ఏదో నా సొంత పనుల కోసం కాదు. ప్రజల కోసం.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఈ ప్రయత్నం చేశాను. అయినా అప్పాయింట్ లేదు “-అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ నాయకుడు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అసంతృప్తులు ఇటీవల కాలంలో చాలానే వినిపిస్తున్నాయి. దీంతో నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో కేవలం ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటాను.. అనే విషయాన్ని ఆచరిస్తూనే.. నేతలకు కూడా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆ ఒక్కటీ సాధిస్తే.. ఇక, జగన్‌కు తిరుగు ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, అప్పుడు ఆయనే నెంబర్ 1 అవుతారని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
-vuyyuru subhash