పార్టీ బలోపేతానికి ఏపీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది. నేతలను చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది..చేరికల విషయంలో బిజెపి నేతల మాటలు కోటలు దాటినా…ఇతర నేతలు మాత్రం సొంత పార్టీ గడప కూడా దాటడం లేదు. సోము వీర్రాజు సారధిగా వచ్చిన తరువాత పార్టీలో చెప్పుకోదగ్గ చేరికే లేదు. దీంతో కొత్త ప్యూహానికి తెరలేపిందట కమల దళం.
రహస్య భేటీలు.. నేరుగా సంప్రదింపులు జరుపుతున్నా.. అనుకున్న స్థాయిలో కాదు కదా.. కనీసస్థాయిలో కూడా బీజేపీలోకి చేరికలు లేవు. అత్యంత బలంగా ఉన్న వైసీపీని వీడి రావడానికి కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరట. అందుకే టీడీపీపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకులు.. తెలుగుదేశం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ మేరకు ఫలితం మాత్రం కనిపించడం లేదట. దీంతో ట్రెండ్ మార్చేసిందట ఏపీ బీజేపీ.
ఆదినారాయణ రెడ్డి, రావెల కిషోర్ బాబు, వరదాపురం సూరి వంటి వారు ఎప్పుడో బీజేపీలో చేరారు. ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా చాన్నాళ్ల క్రితమే కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆ తరువాత ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆకర్ష్ మంత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. బీజేపీలో చేరితే అభయం అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారట కమలనాథులు. అధికారపార్టీ వైసీపీ నుంచి, ప్రభుత్వం నుంచి వేధింపులు ఉన్న వారిని చేర్చుకుంటాం అని చర్చలు మొదలు పెడుతున్నారట. ఆ విధంగా ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలకు గాలం వేస్తున్నట్టు సమాచారం.
వైజాగ్‌లో జరిగిన కోర్ కమిటీ మీటింగ్‌లో పార్టీలో చేరికలపై విస్తృత చర్చ జరిగిందట. కేసులు, రాజకీయ దాడులు, ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే వ్యవహారాలతో సతమతం అవుతున్న తెలుగుదేశం నాయకులను టచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. బీజేపీలో చేరితే వారిని వైసీపీ పట్టించుకోదని.. ఇబ్బంది పెట్టబోదని మాట ఇస్తున్నట్టు సమాచారం. కడప, అనంతపురం జిల్లాలలో గతంలో టీడీపీని వీడి బీజేపీలో చేరిన నేతలు కూడా కేసులు, వేధింపుల భయంతోనే పార్టీ మారారు అన్నది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. వారు తమ పార్టీలో చేరడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని ఉదహరిస్తూ.. కొత్త రాజకీయానికి తెరతీస్తున్నారట. ఈ ఆకర్షణ అస్త్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.