రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ అధ్యక్షత వహించనున్నారు. అలాగే ఈ సమావేశానికి 17 పార్టీల ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిని నిలుపాలని నిర్ణయించారు.
ఇప్పటికే శరద్ పవార్‌ను రాష్ట్రపతి విపక్ష ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన నిరాకరించడంతో ఉమ్మడి అభ్యర్థి కోసం ఏకాభిప్రాయ సాధనకు మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా.. ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. భారత ప్రజాస్వామ్య, సామాజిక వ్యవస్థకు నష్టం కలుగకుండా ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నిలువరించడానికి భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండే వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికోవాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.