తెలంగాణ రాజకీయాలను తన కనుసైగలతో ఇంత కాలం శాసించిన వ్యక్తి కేసీఆర్. ఇప్పటి వరకు అసలు కేసీఆర్‌కు ఎదురు నిలిచే వ్యక్తే తెలంగాణలోలేడనే చెప్పాలి. అన్ని పార్టీలను కేసీఆర్ నిర్వీర్యం చేసి అందులోని కీలక నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇన్నాళ్లకు కేసీఆర్‌ను ప్రశ్నించే నేతల చేతులకు పార్టీ పగ్గాలు రావడంతో ఆయనలో కొంత కలవరం మొదలైందని తెలుస్తోంది.
మొన్నటి వరకు నిస్సత్తువగా, నిద్రమత్తులో జోగిన కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న మంచి నిర్ణయం. రేవంత్ వెంట నడిచేందుకు సీనియర్లతో పాటు యువత ఉత్సాహం కనబరుస్తుంది. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, బీజేపీనీ ఇరుకున పెట్టే వ్యూహంతో ముందుకు దూసుకుపోతున్నాడు రేవంత్.
ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బండి సంజయ్ ఎంట్రీతో బీజేపీ కొత్త అద్యాయం మొదలైంది. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలతో బలం పుంజుకున్న బీజేపీకి బండి సంజయ్ దూకుడు బాగా కలిసి వచ్చింది. సై అంటే సై అంటూ అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక తెలంగాణ కోడలినంటూ రాజన్న బిడ్డ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పేరుతో షర్మిల టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించింది. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేపడుతుంది. షర్మిలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించకపోయినా. ఎన్నికలకు సమయం ఉండటం వల్ల ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.
ఇప్పటికే కేసీఆర్ వ్యతిరేకత అంటూ అన్ని పార్టీలు టీఆర్ఎస్‌ను గద్దె దించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు గా, కాంగ్రెస్, బీజేపీ జత కట్టవచ్చు.నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది కానీ, పట్టు మాత్రం చిక్కినట్లు కనిపించట్లేదు. హుజూరాబాద్‌లో గెలిచి సత్తా చాటి ప్రత్యర్థులను కోలుకోకుండా చేయ్యలన్నది టీఆర్ఎస్ ముందున్న ప్రధమ కర్తవ్యం.
గత వరుస ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు ఎంతగా పోటీ ఇస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాగా ఇలా ముగ్గురూ ఒకేసారి పార్టీలతో నిరసనలకు దిగుతుండటంతో ఈ ముగ్గురు కూడా పెద్ద శక్తిగా ఎదుగుతున్నారనే చెప్పాలి. వారి ఇమేజ్‌తో రాష్ట్రంలో వరుసగా నిరసనలకు పిలుపునిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లకు కేసీఆర్‌లో కొంత కలవరం మొదలైందని తెలుస్తోంది. ఇక యూత్ కూడా టీఆర్ ఎస్‌ను వీడటంతో కేసీఆర్ లో చాలా కాలం తర్వాత కొంత టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.