తిరుమలలో సామాన్య భక్తులకు సిఫారసు లెటర్ ఉంటేనే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. కానీ ఇకపై అలా కాదు. ఎలాంటి లెటర్ లేకున్నా భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం పొందవచ్చు. ఆ సదవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పేరుంది. ఏడుకొండలపై వెలసిన శ్రీవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే కొన్ని వేల మంది భక్తులు నిత్యం స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమలలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కొన్ని సార్లు ఇబ్బందులు పడుతుంటారు. ఎవరికైనా త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉంటుంది. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది.
తిరుమలలో కేవలం వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారానే స్వామి వారిని అత్యంత వేగంగా దర్శించుకునేందుకు వీలుంటుంది. అయితే అది కేవలం సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీలతోపాటు సిఫారసు లెటర్ ఉన్నవారికే లభిస్తుంది. సామాన్య భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం లభించడం దాదాపుగా అసాధ్యం. అయితే ఇప్పటి వరకు ఇలా జరిగిందేమోకానీ.. ఇకపై మాత్రం భక్తులు ఎలాంటి సిఫారసు లెటర్ లేకుండానే నేరుగా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అయితే అందుకు ఏం చేయాలంటే…
భక్తులు టీటీడీ చేపడుతున్న శ్రీవాణి అనే పథకానికి రూ.10వేలు విరాళం అందివ్వాలి. అంతే.. అలాంటి భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. దీంతో ఆ దర్శనం ద్వారా స్వామి వారిని వేగంగా దర్శించుకోవచ్చు. కాగా శ్రీవాణి పథకానికి అందే నిధులను మన దేశంలో ఉన్నటీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తారని టీటీడీ ప్రతినిధులు చెబుతున్నారు..!