ఉగ్రవాదులు దాడికి ముందు ఆ ప్రాంతాల్లో రెక్కీ చేశారా..?

-

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. బైసరన్ లోయలో జరిగిన దాడికి కొన్ని రోజుల ముందు, సమీపంలోని బేతాబ్ వ్యాలీలో ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో ఇద్దరు అనుమానితులు కనిపించగా, వారిని దాడికి పాల్పడిన నిందితుల ఊహాచిత్రాలతో పోల్చిన అధికారులు కీలక సమాచారం గుర్తించారు. పుణేకు చెందిన మలయాళీ సామాజిక కార్యకర్త శ్రేజిత్ రమేశన్ తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ 18న బేతాబ్ వ్యాలీకి వెళ్లారు. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో సరదాగా గడిపిన క్షణాలను వీడియో రూపంలో తలపులను దాచుకున్నారు. నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

 

ఈ దాడి వార్తలు వినిన రమేశన్‌కు, తాను తీసిన వీడియోల్లో కనిపించిన ఇద్దరు వ్యక్తులు అధికారులు విడుదల చేసిన నిందితుల ఊహాచిత్రాలతో పోలి ఉన్నారని అనుమానం కలిగింది. వెంటనే తన వీడియోలు క్షుణ్ణంగా పరిశీలించి, ఆ క్లిప్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అందజేశారు. ప్రస్తుతం వీడియో విశ్లేషణ జరుగుతోంది. ఫోరెన్సిక్ పరిశీలన ద్వారా ఈ వ్యక్తుల ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. దాడి జరిగిన బైసరన్ వ్యాలీకి బేతాబ్ వ్యాలీ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారులు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని రమేశన్‌ను కోరినట్లు సమాచారం. అలాగే ఈ విషయంపై మీడియాతో మాట్లాడకూడదని సూచించారు. ఈ పరిణామాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుసంధానాలను సూచిస్తున్నాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news