మనలో అధిక శాతం మందికి నోట్‌బుక్స్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యాంశాలకు చెందిన వివరాలను రాసుకోవడానికి, వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించి అంశాలను నోట్ చేసుకోవడానికి.. జర్నలిస్టులకు, ఇతర అనేక అంశాలను రాసుకునేందుకు.. చాలా మంది నోట్‌బుక్స్‌ను వాడుతుంటారు. అయితే నోట్‌బుక్స్‌ను తయారు చేసి విక్రయించే బిజినెస్ చేస్తే అందులో చక్కని లాభాలు సంపాదించవచ్చు. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్‌బుక్స్ తయారు చేసేందుకు మనకు 3 రకాల మెషిన్స్ అవసరం అవుతాయి. అవి.. స్క్వేర్ కటింగ్ మెషిన్, పిన్ పంచింగ్ మెషిన్, లెవల్ మెషిన్.. వీటి ధర రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ మెషిన్లను ఉంచేందుకు కాస్త ఎక్కువగానే స్థలం అవసరం అవుతుంది. కనుక ఇండ్లలో స్థలం ఉంది అనుకునేవారు నిరభ్యంతరంగా వీటితో నోట్‌బుక్స్ తయారు చేయవచ్చు. స్థలం లేని వారు షెడ్లను లేదా షటర్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ మెషిన్లలో ఫుల్లీ ఆటోమేటిక్‌వి కూడా ఉంటాయి. వాటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంత ధర పెట్టే సామర్థ్యం ఉంటే.. ఆ ఆటోమేటిక్ మెషిన్లనే కొనుగోలు చేయవచ్చు. దీంతో ఎక్కువ సంఖ్యలో నోట్‌బుక్స్‌ను తక్కువ సమయంలోనే తయారు చేయవచ్చు. అదే మేర లాభాలు కూడా ఉంటాయి.
ఇక ఈ మెషిన్లకు ఇండ్లకు వచ్చే సాధారణ విద్యుత్ సరిపోతుంది. 3 ఫేజ్ కరెంట్ అవసరం లేదు. నోట్‌బుక్స్ తయారు చేసేందుకు ముడి సరుకు కావల్సి ఉంటుంది. నోట్‌బుక్స్ తయారీలో వాడే పేపర్ ధర దాని జీఎస్ఎం క్వాలిటీని బట్టి ఉంటుంది. సాధారణంగా నోట్‌బుక్స్‌లో ఉపయోగించే తెల్లని లేదా రూల్డ్ పేపర్ 1 కేజీ ధర రూ.40 నుంచి రూ.60 మధ్య ఉంటుంది. ఇక 1 కేజీ పేపర్‌తో దాదాపుగా 8 నుంచి 10 నోట్‌బుక్స్‌ను తయారు చేయవచ్చు. అయితే నోట్‌బుక్స్ వాటిలో ఉంచే పేపర్ల సంఖ్యను బట్టి తయారవుతాయి. నోట్‌బుక్స్‌లో ఎక్కువ పేపర్లను ఉంచాల్సి వస్తే.. తక్కువ బుక్స్ తయారవుతాయి. అదే తక్కువ పేపర్లను ఉంచితే ఎక్కువ బుక్స్ తయారుచేయవచ్చు. సాధారణంగా నోట్ పుస్తకాల్లో 50, 100, 150, 200 పేజీల వరకు ఉంటాయి. ఈ విధంగా నోట్‌బుక్స్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.
నోట్‌బుక్స్ తయారు చేసేందుకు వాడే అట్ట, దానిపై డిజైన్‌కు దాదాపుగా 80 పైసల నుంచి రూ.1 వరకు ఖర్చవుతుంది. అయితే మీరు తయారు చేసే నోట్‌బుక్ ఖరీదు రూ.30 లోపు ఉంటే.. దాంట్లో పేజీలకు తక్కువ జీఎస్ఎం క్వాలిటీ కలిగిన పేపర్లను ఉపయోగించాలి. నోట్‌బుక్స్‌ను తయారు చేయడానికి ముందు వాటి సైజ్‌ను ఎంచుకోవాలి. కొన్ని తక్కువ సైజులో, మరికొన్ని పొడవుగా ఉంటాయి. అలాగే వాటిల్లో ఉండే పేజీల సంఖ్య కూడా మారుతుంది. కనుక ఏ సైజులో నోట్‌బుక్స్ తయారు చేయదలచుకున్నారు, వాటిల్లో ఎన్ని పేజీలు ఉండాలి అనే వివరాలను ముందుగానే నిర్దారించుకోవాలి. ఆ మేర పేజీలు, అట్టలు, డిజైన్లను కట్ చేసి.. అన్నింటినీ కలిపి మెషిన్ సహాయంతో పిన్ చేయాలి. దీంతో నోట్‌బుక్స్ తయారవుతాయి. ఇక వీటిని అమ్మడం వల్ల ఏమేర లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం తయారు చేసే నోట్‌బుక్స్‌లో ఉండే పేజీల క్వాలిటీ, బుక్స్ లో ఉండే పేపర్ల సంఖ్య, వాటి సైజును బట్టి ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక నోట్‌బుక్ తయారు చేసేందుకు దాదాపుగా రూ.10 నుంచి రూ.15 వరకు ఖర్చవుతుంది. దాన్ని రూ.4 నుంచి రూ.10 మార్జిన్ వేసి విక్రయించవచ్చు. అంటే ఒక్క నోట్ బుక్‌ను రూ.14 నుంచి రూ.25కు విక్రయించవచ్చు. ఇక 100 నోట్‌బుక్స్‌కు రూ.400 నుంచి రూ.1000 వరకు లాభం ఉంటుంది. నోట్‌బుక్స్ ధరను బట్టి ఇది మారుతుంది. రూ.25 ఖరీదు చేసే నోట్‌బుక్స్‌ను నిత్యం 100 వరకు తయారు చేసి అమ్మితే.. అందులో రూ.10 మార్జిన్ కనుక.. 100 * 10 = రూ.1000 వస్తాయి. నెలకు రూ.30వేలు వస్తాయి. ఇలా నోట్‌బుక్స్ తయారీలో లాభాలను పొందవచ్చు.
ఇక సాధారణంగా ప్రతి ఏటా జూన్ నెలలో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక.. మే నెల నుంచే నోట్‌బుక్స్‌ను తయారు చేసి వాటిని ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు అమ్మవచ్చు. దీంతో మంచి లాభాలు ఉంటాయి. అలాగే స్టేషనరీలు, కాలేజీలు, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు, కిరాణా స్టోర్లకు నోట్ బుక్స్‌ను సరఫరా చేయగలిగితే అధిక మొత్తంలో లాభాలను ఆర్జించవచ్చు..!!