విధులు నిర్వర్తిస్తూ కరోనా సోకి మరణించిన ఉద్యోగస్తుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఏపీలో 200 మంది వైద్య సిబ్బంది, 600 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు తెలుస్తోందని, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రోగులకు సేవలు అందిస్తున్న వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని పవన్ తెలిపారు. అలాగే పోలీస్ శాఖలో ఇప్పటి వరకు 10 మంది వరకు కరోనా బారిన పడి మరణించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కోవిడ్ విధుల్లో నిమగ్నమై చనిపోతున్నవారి కుటుంబాలను ఆదుకోవాలి – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/vvYZRJnWHP
— JanaSena Party (@JanaSenaParty) July 18, 2020
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పలువురు విధులకు హాజరవుతున్నారని.. ఆ సమయంలో వారు కరోనా బారినపడుతున్నారని పేర్కొన్నారు. వైద్యానికీ, తదనంతరం తీసుకోవాల్సిన విశ్రాంతికీ నాలుగు వారాల సమయం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ కాలానికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారికీ ఈ తరహా సెలవులు అవసరమని అభిప్రాయపడ్డారు.