ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా పర్చూరులో రచ్చబండ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు అధికార మదంతో కొట్టుకుంటున్నారని, తాను అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. వైసీపీ నేతలు ఎవరినైనా, ఏమైనా అనొచ్చు కానీ, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.
వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడు అంటున్నారని ఆరోపించారు పవన్ కల్యాణ్. తాను ఎవరికీ దత్తపుత్రుడ్ని కాదని, కేవలం ప్రజలకే దత్తపుత్రుడ్ని అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. జగన్ మాత్రం కచ్చితంగా సీబీఐకి దత్తపుత్రుడేనని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోకతప్పదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. కాగా, పర్చూరు సభలో 80 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, కన్నీళ్లు తుడవడానికి డబ్బు కంటే గుండె ఉంటే చాలని అన్నారు. మూడేళ్లలో 3 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు పవన్ కల్యాణ్.