గత రెండు రోజుల నుంచి ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. విశాఖగర్జన తరువాత విశాఖలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే.. ఎట్టకేలకు.. విశాఖ నుంచి తీవ్ర పరిణామల నేపథ్యంలో మంగళగిరి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మూడు రాజధానులను అందరూ మర్చిపోతున్నారన్న కారణంగా ఇప్పుడు రెచ్చగొట్టే పనులకు పాల్పడుతున్నారన్నారు. సంఘవిద్రోహ శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎదుర్కోవాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందన పవన్ కల్యాణ్ ఆరోపించారు. కోనసీమలో జరిగింది ఇదేనని, వైసీపీ నేతల నోళ్లకు అడ్డుఅదుపు ఉండదని, మాట్లాడితే బూతులే. ఇంట్లోవాళ్లను కూడా తిడుతుంటారన్న పవన్ కల్యాణ్.. రాజకీయాలంటే భయపడిపోవాలని వారు అనుకుంటారన్నారు. కానీ వైసీపీ ఉడుత ఊపులకు ఎవరు భయపడతారు అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనవాణి నిర్వహించాలనేది మా పార్టీ పరమైన నిర్ణయమని, మా కార్యక్రమం రోజునే గర్జన కార్యక్రమం పెట్టుకుంది మీరని, అయినా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు గర్జించడం, కూతలు కూయడం ఏంటి? గర్జించేది ఎవరంటే… ప్రభుత్వంలో లేని నిస్సహాయులు. అధికారంలో దూరంగా ఉన్నవాళ్లు మా కడుపుకోత వినండి, మాకు అన్యాయం జరిగింది అని గర్జిస్తారు. మేం సామాజిక బాధ్యత ఉన్నవాళ్లం. అవసరమైతే గొడవలు పెట్టుకుంటాం, అయితే అవి నిర్మాణాత్మకంగా ఉంటాయి. కానీ వైసీపీకి మాత్రం వయాలెన్స్ కావాలంటారు, కోనసీమలో కూడా వాళ్లు అదే ప్రయత్నం చేశారు. వాళ్ల మంత్రి విశ్వరూప్ ఇంటిని వాళ్లే తగలబెట్టి, మా వాళ్లపై వేయాలని చూశారు. దాన్నికూడా తిప్పికొట్టాం. ఈ క్రమంలో వైజాగ్ లో జరిగింది కూడా అదే. వాళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమం విఫలం కావడం, గంట తర్వాత నగరంలో అడుగుపెట్టిన మాకు విపరీతమైన జన స్పందన లభించడం, ప్రజాబలం చూసి వాళ్లు ఓర్వలేకపోయారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.