ఏపీలో పవన్ కళ్యాణ్ అంటే తెలుసు. పోనీ.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంటే..తెలుసు..! కానీ, బీహార్‌లో పవన్ కళ్యాణ్ ఎవరు? అనే ప్రశ్న రావడం సహజం. రాజకీయాల్లోకి వచ్చాక.. ఏ నాయకుడికైనా పోలికలు తప్పవు. వారు వ్యవహరించిన తీరు, వారు వేసే వ్యూహాలను పరిశీలించి.. ఎక్కడెక్కడి నాయకులతో అయినా.. ముడిపెట్టి విశ్లేషించడం అనేది.. సర్వసాధారణం. అలాంటి విశ్లేషణే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా తెరమీదకి తెచ్చింది. అదేంటో చూద్దాం. ఏపీలో పవన్ కళ్యాణ్.. 2014లో టీడీపీ-బీజేపీతో కలిసి పనిచేసి వారికి లబ్ధి చేకూర్చారు.
ఇక, కొన్నాళ్లు కలిసి ముందుకు సాగిన తర్వాత.. గత ఏడాది ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలనే సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, యువత ఓట్లను భారీగా చీల్చాలని నిర్ణయించుకుని.. ఆ పార్టీలకు దూరంగా పోటీ చేశారు. అయితే.. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కేవలం ఒకే ఒక్క స్థానంతో పార్టీ బయట పడింది. అంటే.. ఇక్కడ నీతి ఏంటి? జగన్‌ను చెరపాలని అనుకుని.. తానే చెడ్డ పరిస్థితి పవన్‌కు ఏర్పడింది. అలా కాకుండా బీజేపీ-టీడీపీ-పవన్ కూటమిగా పోటీ చేసి ఉంటే.. ఆ ఫలితం వేరేగా ఉండేది! ఇక, ఇప్పుడు బీహార్ పవన్ విషయానికి వద్దాం. అక్కడ ఎల్‌జేపీ చీఫ్.. కేంద్ర మాజీ మంత్రి దివంగత రాం విలాస్ పాశవాన్ కుమారుడు చిరాగ్ కూడా పవన్ మాదిరిగానే పాలిటిక్స్ చేశారు.
ఎన్నికలకు ముందు వరకు కూడా నితీశ్‌తో కలిసి ఉన్న ఆయన.. అనూహ్యంగా బయటకు వచ్చారు. తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు.. బీజేపీ నేతల కనుసన్నల్లో ఆయన నితీశ్‌కు, ఆర్జేడీకి.. చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలో కూటమిగా కాకుండా .. ఒంటరిగా పోటీ చేశారు. ఫలితంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపు గుర్రం ఎక్కాల్సి వచ్చింది. అయితే.. అదే బీజేపీ-నితీశ్ కూటమితో కలిసి పోటీ చేసి ఉంటే.. కనీసంలో కనీసం 25 స్థానాల్లో అయినా.. ఎల్జేపీ గెలుపు గుర్రం ఎక్కేదని అంటున్నారు పరిశీలకులు.
తానే ఎస్సీ, ఎస్టీలకు ప్రతినిధినని అక్కడకూడా చిరాగ్ ప్రకటించుకున్నారు. అదే సమయంలో తనను తాను సీఎం అభ్యర్థిగ ప్రకటించుకున్నారు. చివరాఖరుకు పూర్తిగా చతికిల పడ్డారు. పోటీ చేసిన వారిలో 99 శాతం మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక్కడ జనసేన విషయంలోనూ ఇదే కదా.. జరిగింది! అందుకే చిరాగ్‌ను బీహార్ పవన్ అంటూ.. జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.