ఇంతలోనే ఎంతో మార్పొచ్చేసింది పవన్ లో! ఏపీ సీఎం జగన్.. రెడ్డి – సినిమా నిర్మాత దిల్ రాజు.. రెడ్డి. మీరూ రెడ్డే వారూ రెడ్డే… మీరూ మీరూ… అంటూ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ ప్రసంగం సాగిన సంగతి తెలిసిందే! అయితే అది గతం… ఇప్పుడు పవన్ మారారు…! అవును… తాజాగా రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగం చూసిన అభిమానులు – కార్యకర్తలతో పాటు విశ్లేషకులు కూడా చెబుతున్న మాట అదే… పవన్ – మీరు మారిపోయారండీ అని!
అవును… అరుపులు లేవు – కేకలు లేవు – అల్లరితో కూడిన ఆటపాటలు లేవు! సన్నాసి – సోంబేరీ వంటి మాస్ డైలాగులూ లేవు! రొటీన్ కి భిన్నంగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభ జరిగింది. పక్కాగా రెడీ చేసుకున్న స్పీచ్ తో… తనలో ఎంతో మార్పొంచిందనే దిశగా పవన్ ప్రసంగం ఆధ్యాంతం నడిచింది. మధ్య మధ్యలో పంటికిందరాయిలా పడిన ఒకటి రెండు “సెల్ఫ్” మాటలు, తాటతీస్తా నారతీస్తా వంటి మాటలు మినహా… పవన్ ప్రసంగంలో పరిపక్వత.. మాటల్లో స్పష్టత కనిపించింది!
మిగిలిన సామాజిక వర్గాలకు రాజ్యాధికారం రాకుండా చేస్తున్న కొంతమంది వ్యక్తులంటే తనకు ద్వేషం తప్ప.. రెడ్డి సామాజికవర్గానికి తాను శతృవు కాదని చెప్పే ప్రయత్నం సక్సెస్ అయ్యింది! కమ్మ సామాజికవర్గంతో తనకు స్నేహం ఉందని చేప్పే ప్రయత్నమూ జరిగింది. అంతకంటే ముందు… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల ఐకమత్యం చాలా అవసరం అనే సందేశం జనాల్లోకి వెళ్లింది. అందుకోసం కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల జనాలు ముందుకు కదలాలనే సూచన స్పష్టంగా వచ్చింది.
తాను కాపు సామాజికవర్గంలో పుట్టినా… తనకు చిన్నప్పటినుంచీ రెడ్లతో స్నేహం ఉందని.. శెట్టిబలిజీలకు సమస్య వస్తే కాపులు కదలాలని.. తనకు “తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును” అనే బైబిల్ లోని వాక్యం తాను పాటిస్తానని.. తన ప్రసంగం మధ్యలో నమాజ్ వినిపిస్తే.. ప్రసంగాన్ని ఆపేస్తానని.. దళితులకు న్యాయం జరగాలని… బహుజన వాదం వినిపించే ప్రయత్నం పవన్ ప్రసంగంలో పుష్కలంగా కనిపించింది.
దీంతో… ఇంతలోనే ఎంతమార్పొచ్చింది పవన్ లో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే… పవన్ చెప్పిన మాటలు.. చేతల్లో ఎంతవరకూ కనిపిస్తాయి.. కార్యకర్తలు ఆ మాటలను ఎంతవరకూ పాటిస్తారు అనే అంశాల మీదే… జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంది!! అలాకానిపక్షంలో… అతి తొందరలోనే ఈ మాటలు గాల్లో కలిసిపోయే అవకాశం.. 2019 ఫలితాల జ్ఞాపకాలు వెంటాడే ప్రమాధం ఉంది!