జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నం జనసేన పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను యకుల్ని నమ్మి పార్టీ పెట్టలేదు. కేవలం అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేన పార్టీని స్థాపించా అన్నారు. 2014లో పార్టీ స్థాపించినప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు నువ్వేం చేయగలవు అని చాలా మంది అడిగారు. నేను ముఖ్యమంత్రి అయిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికే వచ్చా అని వివరించారు. పొలిటికల్ ప్రాసెస్‌లో సహనం, పట్టుదల కావాలి. కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి 30 ఏళ్లు సిఎంగా ఉండాలని ఉంది అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో దశాబ్దంపాటు మేమే ఉండాలంటారు.
జనసేన మాతో కలుస్తుందంటే మాతో కలుస్తుంది అని పార్టీలు చాటింపు వేసుకోవడం, తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన మాతోనే ఉందని ప్రచారం చేసుకోవడం మన బలాన్ని తెలియ జేస్తోందని పవన్ కార్యకర్తలకు బరోసా కల్పించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనసేన పార్టీ కార్యకలాపాల కారణంగా పార్టీ బలంగా జనంలోకి వెళ్లింది. దీంతో త్వరలోనే కమిటీల నిర్మాణాన్ని సైతం పూర్తి చేస్తామన్నారు.