ఏపీలో భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు అధికార వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక పక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, మరోపక్క జనసేన ఉల్లిధరలపై ప్రభుత్వం ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. సోమవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా టీడీపీ ఉల్లి ధరలనే టార్గెట్‌గా చేసుకుని నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది.
ఇక చంద్రబాబు సైతం బంగారం – ఉల్లి తూకం వేస్తూ బంగారం ధరతో ఉల్లి పోటీ పడుతోందంటూ నిరసన తెలిపారు. ఇక తాజాగా ఇదే ఉల్లి ధరల పెంపుపై జనసేన అధినేత పవన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. పవన్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారని.. కానీ జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని తనదైన శైలిలో విమర్శించారు. అందుకే ఉల్లి ఎందుకంటూ.. దాని రేటు పెంచేశారని సెటైర్ వేశారు.
ఇక కొద్ది రోజులుగా పవన్ జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా విరుచుకు పడుతోన్న సంగతి తెలిసిందే. గత వారం రాయలసీమ పర్యటనలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు ఉల్లి ధరల పెంపు విషయంలోనూ జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. పెరిగిన ఉల్లి రేట్లతో దళారులు లాభపడుతుంటే… రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని పవన్ ఫైర్ అయ్యారు.