ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరుగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రారంభమైన రోజున ప్రధానంగా ఉల్లి ధరలు, విద్యుత్ ఒప్పందాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇక వైసీపీపై కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ఆనం మాటలకు జగన్‌కు పడి పడి నవ్వుకోవడం అసెంబ్లీలో హైలెట్ అయ్యింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఆందోళన చేస్తోందని.. ఇది సరికొత్త సంప్రదాయమని.. ఇలాంటి సంప్రదాయాన్ని తాను గతంలో ఎక్కడా చూడలేదంటూ ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆనం మాట్లాడుతూ దయచేసి నా సీటు మార్చండి సార్.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్.. ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా సార్.. వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి.. వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను అని ఆనం బాబును ఉద్దేశించి సెటైరికల్‌గా మాట్లాడారు.
ఆనం మాట్లాడుతున్నంత సేపు సీఎం జగన్మోహన్‌రెడ్డి పడి పడి నవ్వుతూనే ఉన్నారు. ఇక వైసీపీ సభ్యులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంతలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని.. సభ్యుల హక్కులను గౌరవించాలని ప్రతిపక్షనేత చంద్రబాబుకు చెప్పారు. ఏదేమైనా నిన్నటి వరకు ఆనంపై జగన్ సీరియస్‌గా ఉన్నారని.. తమ పార్టీకే చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ కూడా ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు వాతావరణం చూస్తుంటే వైసీపీలో ఆనం అసమ్మతి చల్లారినట్టే కనపడుతోంది.