మే 13 న ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీని గద్దే దించేందుకు.. కూటమిగా ఏర్పడ్డ జనసేన, తెలుగుదేశం పార్టీ ,బిజెపి విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.ఇక పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.మచిలీపట్నం లోక్ సభ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచిన జనసేనాని.. స్థానిక ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ పార్లమెంట్ సీటు కోసం పోతిన మహేశ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 30న పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.